Munugode Bypoll: మునుగోడు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పై ఈసీ వేటు.. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కేటీఆర్..

|

Oct 20, 2022 | 4:25 PM

మునుగోడు ఉప ఎన్నిక ఈసీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారుతోంది. గుర్తుల కేటాయింపు రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి జగన్నాధరావుపై ఈసీ వేటు వేయడాన్ని..

Munugode Bypoll: మునుగోడు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పై ఈసీ వేటు.. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కేటీఆర్..
Telangana Minister KTR
Follow us on

మునుగోడు ఉప ఎన్నిక ఈసీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారుతోంది. గుర్తుల కేటాయింపు రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి జగన్నాధరావుపై ఈసీ వేటు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ ఆడించినట్లు ఈసీ ఆడుతోందని నిప్పులు చెరిగారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటి వరకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న జగన్నాధరావుపై ఈసీ బదిలీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు ఉప ఎన్నిక బాధ్యత అప్పగించింది. ఎన్నికల గుర్తుల కేటాయింపులో జగన్నాధరావు తీరుపై సీరియస్‌ అయింది ఈసీ.

అయితే, ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కేంద్ర ఎన్నికల కమిషన్ తీరు సరికాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని విమర్శించారు. పార్టీలకు అతీతంగా, ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పై భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు. గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్‌ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం అని ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

తమ పార్టీ కారును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. రాజ్యాంగ స్ఫూర్తికి బీజేపీ విఘాతం కలిగిస్తోందని, మునుగోడులో ఓటమి తప్పదనే బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఫైర్ అయ్యారు కేటీఆర్‌. భారతీయ జనతా పార్టీ రాజ్యంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు మంత్రి. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ బదిలీపైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం కనుసైగలతో కేంద్ర ఎన్నికల కమిషన్ పని చేస్తుందన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..