Munugode Bypoll: ఎవరి లెక్కలు వారివే.. మునుగోడులో ముగిసిన పోలింగ్‌.. నేతల్లో టెన్షన్.. టెన్షన్..

తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. చెదురు మదురు ఘటనలతో పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

Munugode Bypoll: ఎవరి లెక్కలు వారివే.. మునుగోడులో ముగిసిన పోలింగ్‌.. నేతల్లో టెన్షన్.. టెన్షన్..
Munugode Bypoll

Updated on: Nov 03, 2022 | 6:31 PM

తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. చెదురు మదురు ఘటనలతో పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 బూత్‌లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసినప్పటికీ.. పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడంతో అధికారులు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ జోరందుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైంది. చివరి 2 గంటల్లోనే దాదాపు 40 శాతం ఓటింగ్ జరిగింది. 6 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే ఛాన్స్ ఇవ్వడంతో పోలింగ్‌ శాతం 90 దాటుతుందని పేర్కొంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. చివరిగంటలో ఎక్కువ మంది పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడంతో.. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ శాతంపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది.

మునుగోడులో చివరి గంటలో ఉద్రిక్తత.. ఘర్షణలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. చండూరులో కూసుకుంట్లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా.. మర్రిగూడెంలో రాజగోపాల్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

కాగా.. పోలింగ్ సరళిపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఎవరి లెక్కలు వారివే.. ఎవరి అంచనాలు వారివే ఉన్నాయని అర్ధమవుతోంది. అయితే.. ప్రధాన పార్టీలు పోటీ తీసుకున్న ఈ ఉప ఎన్నికలో గెలుపోటముల్ని యువత డిసైడ్ చేయనుంది. ఈ నెల ఆరున కౌంటింగ్‌ జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..