BC Reservations: మున్సిపల్‌ పోరుకు లైన్‌ క్లియర్.. ఖరారైన బీసీ రిజర్వేషన్‌లు.. ఎంతంటే?

తెలంగాణలో మున్సిపల్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వంకు కీలక నివేదికను సమర్పించింది. మున్సిపాలిటీల్లో వార్డులు, ఛైర్పర్సన్ స్థానాల రిజర్వేషన్లపై ఈ నివేదిక ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకునే దశకు ప్రభుత్వం చేరింది.

BC Reservations: మున్సిపల్‌ పోరుకు లైన్‌ క్లియర్.. ఖరారైన బీసీ రిజర్వేషన్‌లు.. ఎంతంటే?
Municipal Elections Bc Reservations

Edited By:

Updated on: Jan 13, 2026 | 10:32 AM

తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వంకు కీలక నివేదికను సమర్పించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం మొత్తం 50 శాతం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ కోటాను మినహాయించిన తరువాత మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించాలని సూచించింది. పట్టణ ప్రాంతాల్లో గ్రామాలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి కలిపి 15 శాతానికి పైగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

బీసీలకు మాత్రం 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేయనుంది.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో మొత్తం 52,42,993 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.వీరిలో 25,62,358 మంది పురుష ఓటర్లు కాగా, 26,80,005 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతర ఓటర్ల సంఖ్య 630గా ఎన్నికల సంఘం ప్రకటించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితా ఇప్పటికే ప్రచురితమైంది.

బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పణతో పాటు ఓటర్ల తుది జాబితా విడుదల కావడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.