కలెక్టర్‌ను గుండెల్లో దాచుకున్న గ్రామస్తులు.. ఏకంగా చిత్రపటానికి పాలాభిషేకం!

ఎవరైనా మనకు సహాయం, ఉపకారం చేస్తే కృతజ్ఞతలు తెలియజేస్తాం.. గుర్తుంచుకుంటాం. సమాజానికి ఉపయోగపడే పనులు చేసిన నేతలకు విగ్రహాలు పెట్టిస్తాం.. పాలాభిషేకాలు చేస్తాం. ప్రస్తుతం రాజకీయ నేతలకు మాత్రమే పాలాభిషేకాలు జరుగుతుండడం చూసి ఉంటాం. కానీ ఓ జిల్లా కలెక్టర్ కు పాలాభిషేకం చేశారంటే ఆశ్చర్యమే..!

కలెక్టర్‌ను గుండెల్లో దాచుకున్న గ్రామస్తులు.. ఏకంగా  చిత్రపటానికి పాలాభిషేకం!
Yadadri District Collector Hanumantha Rao

Edited By: Balaraju Goud

Updated on: Nov 02, 2025 | 1:26 PM

ఎవరైనా మనకు సహాయం, ఉపకారం చేస్తే కృతజ్ఞతలు తెలియజేస్తాం.. గుర్తుంచుకుంటాం. సమాజానికి ఉపయోగపడే పనులు చేసిన నేతలకు విగ్రహాలు పెట్టిస్తాం.. పాలాభిషేకాలు చేస్తాం. ప్రస్తుతం రాజకీయ నేతలకు మాత్రమే పాలాభిషేకాలు జరుగుతుండడం చూసి ఉంటాం. కానీ ఓ జిల్లా కలెక్టర్ కు పాలాభిషేకం చేశారంటే ఆశ్చర్యమే. ఎందుకు పాలాభిషేకం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఈయన పేరు హనుమంతరావు. ఈయన యాదాద్రి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నాడు. తనదైన శైలిలో పాలనా సంస్కరణలు తీసుకువస్తున్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా, విద్యా, వైద్యం, సంక్షేమం, జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పకడ్బందీగా వ్యవహరించడం, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి చేస్తూ హల్‌చల్ చేస్తుంటారు. జిల్లా ప్రజల సమస్యలు, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే దిశగా సత్వర చర్యలు తీసుకుంటున్నారు.

యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోనీ ఆరవ వార్డు పరిధిలో ఆరెగూడెం, ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన రేషన్ షాప్ నెంబర్ 4408002 ఆరెగూడెంలో ఉంది. ఆరెగూడెం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఇందిరానగర్ ఉంది. రెండు కాలనీల మధ్య రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ప్రతి నెల రేషన్ సరుకుల కోసం 70 రేషన్ కార్డులు ఉన్న ఇందిరానగర్ కాలనీవాసులు ఆరెగూడెంకు రావాల్సి వస్తోంది. రేషన్ సరుకుల కోసం ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వాహన సౌకర్యం లేని నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.

తమ కాలనీలోనే రేషన్ సరుకులు ఇచ్చేలా చూడాలంటూ కొందరు కాలనీవాసులు జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం ఇచ్చారు. వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇందిరానగర్ కాలనీలోనే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఇందిరా నగర్ కాలనీ ఎస్సీ కమిటీ హాల్ లో రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఇందుకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపి కలెక్టర్ హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ సమస్యను కలెక్టర్ హనుమంతరావు వెంటనే పరిష్కరించినందుకు కాలనీవాసులు సంతోషంగా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..