
జగిత్యాల పట్టణం గోవిందుపల్లెకు చెందిన నరేందర్ అనే వ్యక్తి ఆవును పెంచుకుంటున్నాడు. ఆ ఆవు ఇటీవలే ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆవు బుధవారం రాత్రి మేత కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. రాత్రి అయినా సరే తిరిగి రాలేదు. దీంతో లేగ దూడ తల్లి స్పర్శ కోసం .. పాల కోసం తల్లడిల్లింది. తల్లి కనిపించక అంబా అంటూ అరవడం మొదలు పెట్టింది. లేగ దూడ తల్లి కోసం పడుతున్న తపన చూసిన సురేందర్ ఓ ఆటోలో లేగ దూడను తీసుకొని తల్లి ఆవు కోసం పట్టణం అంతా తిరిగాడు. ఎట్టకేలకు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆవు ఉన్నట్లు గుర్తించాడు. ఆటోలో ఉన్న దూడని చూసిన తల్లి కూడా తన బిడ్డని గుర్తించింది. తన దూడను ఎవరో తీసుకెళ్లిపోతున్నారని భావించిన ఆవు వెంటనే ఆ ఆటో వెంట పరుగుతీసింది.
అలా ఆటోని వెంబడిస్తూ చివరకు తన యజమాని ఇంటికి చేరుకుంది. అయితే ఇలా ఆటో వెంట ఆవు పరుగెత్తడం స్థానికులు ఆసక్తిగా చూశారు. కొంత మంది తమ సెల్ ఫోన్లకు పని చెప్పి.. బిడ్డ కోసం తల్లి ఆరాటాన్ని సెల్ ఫోన్లలో బంధించారు. అలా ఆటోవెంట పరుగెత్తి చివరికి తన యజమాని ఇంటికి చేరిన తల్లి ఆవు వెంటనే లేగ దూడకు పాలిచ్చి ఆకలి తీర్చింది. బిడ్డ కోసం తల్లి పడే తపన ఎలా ఉంటుందో సజీవ సాక్ష్యంగా నిలించింది ఈ సన్నివేశం. ఈ ఆవుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..