Telangana: అయ్యో దేవుడా.. పేలిపోయిన ఫ్రిజ్.. తల్లితో 11 నెలల బాబు స్పాట్‌లోనే..
ధరూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలి ప్రమాదంలో తల్లి అశ్విని, ఆమె 11 నెలల బాబు మరణించారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మూసి ఉన్న షాపులో పొగలు రావడంతో చెక్ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఫ్రిజ్ కంప్రెసర్ పేలడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌లో విషాదం చోటచేసుకుంది. ఈ నెల 6న జరిగిన ఫ్రిజ్ పేలి తల్లీకొడుకు మరణించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడగా.. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే తల్లి, 11 నెలల బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ పరిస్థితి విషమంగానే ఉంది. ధరూర్ మండల కేంద్రంలో మూసి ఉన్న ఒక షాపు నుండి పొగలు రావడాన్ని స్థానికులైన అశ్విని, సునీత అనే ఇద్దరు మహిళలు గమనించారు. వారు వెంటనే షాపు షట్టర్ తెరిచి చూడగా ఒక్కసారిగా ఫ్రిజ్ పేలిపోయింది. ఈ భారీ పేలుడు ధాటికి ఆ ఇద్దరు మహిళలతో పాటు అశ్విని వద్ద ఉన్న ఆమె 11 నెలల బాబు తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే స్థానికులు గాయపడిన వారిని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని కర్నూల్‌లోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తల్లి అశ్విని, ఆమె చిన్నారి కన్నుమూశారు. మరొక మహిళ సునీతకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో ధరూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్రిజ్‌లోని కంప్రెసర్ పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
నిపుణుల కీలక సూచనలు
ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇంట్లో ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలను నిపుణులు సూచిస్తున్నారు.
సరైన వెంటిలేషన్: ఫ్రిజ్‌ను ఎప్పుడూ గోడకు లేదా ఇతర వస్తువులకు కనీసం 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. ఫ్రిజ్ వెనుక భాగం వేడిని విడుదల చేస్తుంది. సరైన వెంటిలేషన్ లేకపోతే అది అధిక వేడికి గురై కంప్రెసర్ లేదా ఇతర భాగాలు పేలవచ్చు.
క్రమ పద్ధతిలో శుభ్రత: ఫ్రిజ్ వెనుక భాగంలో కంప్రెసర్ చుట్టూ దుమ్ము, ధూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా వేడి పెరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
వైరింగ్ చెక్: ఫ్రిజ్ కోసం ఉపయోగించే వైరింగ్, ప్లగ్‌లు మంచి నాణ్యత కలిగి ఉన్నాయా..? అవి దెబ్బతిన్నాయా..? అనేది క్రమం తప్పకుండా చెక్ చేయాలి. పాత లేదా లూజ్ వైరింగ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
వోల్టేజ్ స్థిరత్వం: అకస్మాత్తుగా వోల్టేజ్ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఫ్రిజ్‌ను రక్షించడానికి సమర్థవంతమైన స్టెబిలైజర్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
