కోటికి పైగా జనాభాతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో రానున్న ఎండాకాలం మంచినీటి ఎద్దడి తప్పదని పలువార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత వానాకాలం వర్షాలు సరిగా కురవకపోవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. దీంతో నిజంగానే హైదరాబాద్‌కు మంచినీటి కష్టాలు తప్పదేమోనని జనం ఆందోళన చెందుతున్నారు. దీనిపై హైదరాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం కృష్ణ, గోదావరి, సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి రోజూ దాదాపు 2000 మిలియన్ లీటర్ల నీరు నగరంలోకి సప్లై అవుతోంది. దీన్ని జలమండలి రిజర్వాయర్ల ద్వారా నగరవాసులకు పంపిణీ చేస్తోంది. గతేడాది సరైన వర్షపాతం నమోదుకాకపోవడం నాగార్జున సాగర్, గోదావరి బేసిన్ ప్రాజెక్టులు నిండలేదు. దీంతో ఆ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజికి చేరుకుంటే గోదావరి, కృష్ణా పైప్ లైన్ల నుంచి నగరానికి వచ్చే మంచినీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రచారాన్ని ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నీటి నిల్వలు బాగానే ఉన్నాయన్నారు. ఎండాకాలంలో కూడా నగరానికి తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండే స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
జీహెచ్ఎంసీ పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంచినీటి సరఫరాతో పాటు డిమాండ్‌పై ఆయన జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఉన్నతాధికాైరులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడ నుంచి నగరానికి నీరు వస్తుంది.? ప్రాజెక్టుల పనులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయని ఆరా తీశారు. ఎట్టిపరిస్థితుల్లో నగరవాసులకు నీటి సమస్య రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఏ నీటి ప్రాజెక్టులో అయినా మొదటి ప్రాధాన్యం తాగునీటికేనని.. తమ ప్రభుత్వం నీటి కష్టాలు రాకుండా చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజి ఉన్నా 437 అడుగుల లోతులో నీరు ఉన్నా నగరానికి మంచినీటిని తీసుకొని వచ్చేలా సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని.. సెప్టెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు నిర్మాణం పుర్తవుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో రానున్న ఎండాకాలంలో నీటి ఎద్దడి రానుందని కొంత పొలిటికల్ అపోహలు క్రియేట్ చేస్తున్నారని మంత్రి పొన్నం అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నగరంలో నీటి సమస్య రాదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి నగరవాసులకు భరోసా ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..