Lock Down in Telangana: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణలో లాక్‌డౌన్ విధింపుపై నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అవుతోందని, రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించొద్దని అన్నారు. లాక్‌డౌన్ విధింపుపై మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న అసదుద్దీన్.. ఇప్పుడు కూడా అదే విషయాన్ని ఉద్ఘాటించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ పరిష్కారం కాదన్నారు. లాక్‌డౌన్ కారణంగా పేదల జీవితాలు నాశనం అవుతున్నాయని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ విధింపు కంటే ముందే కరోనా కేసులు తగ్గుతున్నట్లుగా ప్రభుత్వ వివరాలు స్పష్టం చేస్తున్నాయని ఉటంకించిన ఆయన.. లాక్‌డౌన్ వల్లే కేసులు తగ్గలేదన్నారు. లాక్‌డౌన్ విధించకుండా కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
కరోనా మహమ్మారిపై సుధీర్ఘ పోరాటం చేయాలన్న వాస్తవాన్ని అందరమూ అంగీకరించాలన్న అసదుద్దీన్.. మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చునని అన్నారు. దీనికి అనుగుణమైన జీవన విధానం ఉండేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలన్నారు. అంతేకాదు.. కరోనా మహమ్మారికి దీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమే అసదుద్దీన్ నొక్కి చెప్పారు. లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందలపాలవుతున్నారని అన్నారు. అటు కరోనా, ఇటు పేదరిక, మరోవైపు పోలీసుల వేధింపులతో ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతి, భద్రతల సమస్యగా మారుస్తున్నాయన్నారు. ఇది ఎంతమాత్రం శాస్త్రీయ, మానవతా దృక్పథం కాదన్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించవొద్దని గట్టిగా కోరుతున్నానని చెప్పిన అసదుద్దీన్.. కరోనా నివారణకు జనసమ్మర్దాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించాలన్నారు. లేదా కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్ విధించాలన్నారు. కానీ, 4 గంటల సడలింపులతోనే 3.5 కోట్ల మంది జీవనం వారాల పాటు కొనసాగించాలని భావించడం తగదన్నారు.
Asaduddin Owaisi:
లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోంది. లాక్ డౌన్ పై నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నాను. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి.1/5
— Asaduddin Owaisi (@asadowaisi) May 30, 2021
Also read: