
హైదరాబాద్, ఆక్టోబర్ 02: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా పలు పార్టీల నేతలు టిక్కెట్ల కోసం కసరత్తులు చేస్తున్నారు. అదేక్రమంలో.. ఆయా పార్టీల్లో టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలతోపాటు శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. చేరికలు, డిక్లరేషన్లతో ఎన్నికల రేసులో దూసుకుపోతున్న కాంగ్రెస్‌కు నందికంటి శ్రీధర్ షాకిచ్చారు.
ఆ పార్టీకి రాజీనామా చేసి లెటర్‌ను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. దాంతో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లు అయింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరికతో అసంతృప్తికి గురై ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు లేఖలో తెలిపారు నందికంటి శ్రీధర్. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి టిక్కెట్ మైనంపల్లికే ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్పడంతో రాజీనామా చేశారు.
వాస్తవానికి.. టీ.కాంగ్రెస్‌లో సీనియర్ బీసీ నేతగా ఉన్న నందికంటి శ్రీధర్.. అసెంబ్లీ టిక్కెట్ వస్తుందని భావించారు. కానీ.. మూడు రోజుల క్రితం ఢిల్లీకి పిలిపించుకుని ఆయన్ను రాహుల్ బుజ్జగించేందుకు ప్రయత్నించారు. దాంతో.. తీవ్ర నిరాశకు గురైన నందికంటి శ్రీధర్.. డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగదని భావించే రాజీనామా చేసినట్లు శ్రీధర్ వెల్లడించడం కాక రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ తనకు వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ వస్తుందని ఆశించిచానని.. కానీ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘిస్తూ మైనంపల్లి ఫ్యామిలీకి మెదక్, మల్కాజిగిరి టికెట్లు ఇస్తున్నారని.. ఇది అన్యాయమని లేఖలో ఆరోపించారు నందికంటి శ్రీధర్.
ఇక.. మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరినప్పుడే నందికంటి శ్రీధర్ పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. దాంతో.. అలర్టైన కాంగ్రెస్.. ఆయనతో చర్చలు జరిపింది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆఫర్ చేయడంతోపాటు.. రాహుల్ బుజ్జగించినా ఫలితంగా లేకుండా పోయింది. ఎంపీ టిక్కెట్ ఆఫర్ లెక్కచేయకుండానే కాంగ్రెస్‌కు శ్రీధర్ రాజీనామా చేయడంతో ఎన్నికల వేళ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్చేనన్న చర్చలు సాగుతున్నాయి. మొత్తంగా.. నందికంటి రాజీనామాతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే షాక్ తగిలింది. మరి.. నందికంటి లోటును రేవంత్ ఎలా భర్తీ చేస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి