Telangana: ఇలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఎలా..? రాత్రికి రాత్రే మాయమైన కాలేజ్ చైర్మన్..
కోట్లాది రూపాయల అప్పుల కుంపటి రాజేసి ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ చైర్మన్ రాత్రికి రాత్రే మాయమయ్యాడు.. దీంతో అక్కడి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీ యాజమాన్యం బోర్డు తిప్పేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కోట్లాది రూపాయల అప్పుల కుంపటి రాజేసి ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ చైర్మన్ రాత్రికి రాత్రే మాయమయ్యాడు.. దీంతో అక్కడి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ ఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీ యాజమాన్యం బోర్డు తిప్పేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి సుమారు రూ. 8 కోట్లు అప్పు చేసి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులతో పాటు, అప్పులు ఇచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహేందర్‌రెడ్డి పరారైన తర్వాత, కాలేజీని మధ్యవర్తుల సాయంతో అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా, విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కొందరు ఏజెంట్లను పంపించినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేందర్‌రెడ్డి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు, అతని ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల సర్టిఫికెట్లు తిరిగి ఇప్పించి, వారికి ఇతర కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే, మహేందర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, అప్పులు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
