
సంక్రాంతి పండగ నేపథ్యంలో చాలా మంది చకినాలు.. ఇతర పిండి వంటలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో గిర్నీలు అందుబాటులో లేక.. మరికొన్ని ప్రాంతాల్లో పిండి గిర్ని ఉన్నప్పటికి విద్యుత్తు అంతరాయంతో పిండి మర పట్టించుకోలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టాలను గమనించిన కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లోని రహ్మత్ నగర్ కు చెందిన సయ్యద్ మాజీద్ అలీ ఏకంగా తన బైక్ నే పిండి మర పట్టే గిర్నిగా మార్చేసి భళా అనిపించుకున్నాడు.
వినియోగదారుల ఇళ్ల వద్దకే గిర్నీని తీసుకెళ్లి పిండి పట్టించి ఇస్తూ వినియోగదారుల దూరభారాన్ని తగ్గించాడు. బైక్ మెకానిక్ గా పనిచేసిన అనుభవంతో ఓ పాత మోటారు సైకిల్ తీసుకుని.. దాని సీటు తొలగించి ఆ స్థానంలో పిండి మర బిగించిన మాజిద్… బైక్ టైరుకు బెల్టును అమర్చి ఇదిగో ఇలా పిండి గిర్నిని రెడీ చేశాడు. ఆసిపాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సమీప గ్రామాల్లో తిరుగుతూ ఇళ్ల వద్దే పిండి పట్టి ఇస్తున్నాడు. కరెంట్ కష్టాలను చెక్ పెట్టడంతో పాటు వినియోగదారుల దూర భారాన్ని సైతం తగ్గించి సరసమైన ధరలోనే పిండిని పట్టించాడు ఈ బైక్ గిర్ని ఓనర్. గతేడాది కూడా వినూత్నంగా ఆలోచించి ట్రాక్టర్ పై పిండి మర ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకే వచ్చి పిండి మర పట్టించిన మాజిద్.. ట్రాక్టర్ కు గిర్నీ పెట్టడం డీజిల్ ఖర్చు ఎక్కువ కావడంతో ఈసారి మరింత వినూత్నంగా బైక్ పై మరను బిగించినట్లు తెలిపాడు.
వీడియో ఇక్కడ చూడండి..
తాను 7వ తరగతి వరకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకొని అంతటి తోనే చదువును ఆపేశానని.. ఆ తర్వాత ఒక బైక్ మెకానిక్ షాప్ లో కొన్నాళ్ళు పని చేశానని… తర్వాత స్వంతంగా చిన్నగా పిండి గిర్ని పెట్టుకున్నానని తెలిపాడు. గిర్ని నడిపే సమయంలో గిరాకీ ఉన్నప్పుడే కరెంట్ పోవడం వల్ల ఏదో ఒకటి చేసి ఇలాంటి సమస్య నుండి బయటపడాలి అనే ఆలోచించే క్రమంలో గత ఏడాది ట్రాక్టర్ ఇంజిన్ తో గిర్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని.. స్వయంగా మెకానిక్ గా పని చేసిన అనుభవం ఉండటంతో తన ప్రయత్నాన్ని మొదలు పెట్టానని.. రెండు మూడు సార్లు తన ప్రయత్నం విఫలమైన అంతటితోనే ఆగకుండా మార్పులు చేర్పులు చేసుకుంటూ తన ప్రయత్నాన్ని కొనసాగించి సక్సెస్ అయ్యానని తెలిపాడు. ఈ ఏడాదిమరింత భారం తగ్గించేందుకు బైక్ గిర్నీని తయారు చేశానన్నాడు మాజీద్. ప్రభుత్వం తనకు సహకరిస్తే భవిష్యత్తులో ఇలాంటి యంత్రాలు తయారీకి కృషి చేస్తానని తెలిపాడు మాజిద్.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..