AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో జరిగిన ఈ విషాద ఘటన వన్యప్రాణుల వేట ఏ విధంగా ప్రాణాంతకంగా మారుతుందో తెలియజేస్తోంది. ఖమ్మం తోగు - బుగ్గ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట ఒక వ్యక్తి ప్రాణం తీసింది. అడవి బిడ్డలుగా చెప్పుకునే వారు ఇలా అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి
Electric Wire Trap Forest
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 22, 2026 | 7:15 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు అటవీ ప్రాంతం అక్రమ వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. వన్యప్రాణులను వేటాడటం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఒక మనిషి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పగిడేరు గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి తెల్లవారుజామున వేట కోసం ఖమ్మం తోగు – బుగ్గ అడవుల్లోకి వెళ్లారు. అదే సమయంలో అడవి జంతువుల కోసం మరో వర్గం వేటగాళ్లు రహస్యంగా భూమికి కొద్దిగా పైన విద్యుత్ తీగలను అమర్చారు. చీకట్లో ఆ తీగలను గమనించని సుమన్, వాటిని తాకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై ఘటనా స్థలంలోనే మరణించాడు. సుమన్‌తో పాటు ఉన్న మిగిలిన ముగ్గురు అప్రమత్తమవ్వడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన కొందరు వలస గిరిజనులు అటవీ జంతువుల మాంసం కోసం ఈ విద్యుత్ ఉచ్చులను అమర్చినట్లు గుర్తించారు. వేటగాళ్ల మధ్య ఉన్న పోటీ మరియు ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతులు వాడటం వల్ల ఈ ఘోరం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ప్రమాదకరమైన విద్యుత్ తీగలు అమర్చడం వల్ల కేవలం జంతువులే కాకుండా అడవిలోకి వెళ్లే సాధారణ ప్రజలు, పశువుల కాపరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ విద్యుత్ తీగలు అమర్చడం వల్ల వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అడవి బిడ్డలుగా చెప్పుకునే వారు ఇలా అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయగలమని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us