Tiger Fear – Telangana: తెలంగాణలోని పలు జిల్లాలను పులులు వణికిస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మ్యాన్ ఈటర్ హడలెత్తిస్తోంది. మరోమారు బెబ్బులి సంచారంతో అటవీ అధికారులకు పెద్దపులి బాధ్యత గుదిబండలా తయారైంది. తెలంగాణ ప్రాతంలో అసలు ఎన్ని పులులు ఉన్నాయో లెక్క తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పులులు ప్రత్యక్షం అవుతుండడంతో అటవీశాఖ సిబ్బందికి తల బొప్పి కడుతోంది. తమ ప్రాంతాల్లోకి వచ్చిన పులులను కాపాడుకోవడం తమ బాధ్యత కావడంతో.. రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు అటవీశాఖ సిబ్బంది. అడవుల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని మరీ పులికి కాపలా కాసే పరిస్థితి నెలకొంది.
తాజాగా పినపాక ఏజెన్సీలో పెద్దపులి అలజడి సృష్టిస్తుంది. గత ఐదు రోజులుగా పినపాక-కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచరిస్తుండడంతో స్థానిక ఆదివాసీలు హడలిపోతున్నారు. తాడ్వాయి అడవుల నుండి కరకగూడెం మీదుగా పినపాక అడవుల్లోకి ప్రవేశించిన పెద్ద పులి.. అమరారం సమీపంలో మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేసి ఆవును చంపింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలు ఎవరు కూడా అడవుల్లోకి వెళ్లకూడదంటూ అప్రమత్తం చేశారు. అదే సమయంలో పులికి ఎటువంటి హాని తలపెట్టకూడదంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అటవీ సమీప గ్రామాల ప్రజలు పొలాల్లోకి కూడా వెళ్లకుడాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఐదు రోజులుగా పులి పినపాక అడవుల్లో సంచరిస్తుండడంతో స్థానిక ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి మాన్ ఈటర్ గా అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువతిపై దాడి చేసి చంపిన పులి దాని పాద ముద్రాలు, చర్మం పై ఉన్న చారల ఆధారంగా గుర్తించారు. దీంతో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పులి నుండి మనుషులకు, మనుషుల నుండి పులికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.
పినపాక మండల పరిధిలో గత ఐదు రోజులుగా పెద్దపులి సంచరిస్తుండడంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికి పోతున్నారు. కూలికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితుల్లో పులి దెబ్బకు మరింత దీన స్థితిలోకి దిగజారుతున్నారు ఇక్కడి రైతు కూలీలు. అప్పు చేసి సాగు చేసిన పంటలు చెతికొచ్చే దశలో ఈ ప్రాంతంలో పులి తిరుగుతుండడంతో గ్రామం దాటి అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని పులిని ఈ ప్రాంతం నుండి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ఎడూళ్ళ బయ్యారం రేంజ్ పరిధిలోని పినపాక – కరకగూడెం అడవుల్లో ఐదు రోజులుగా పులి సంచరిస్తుందని, ప్రజలు ఎవరూ కూడా కొన్ని రోజుల వరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులు. గ్రామాల్లో నిత్యం తిరుగుతూ పులికి ఎటువంటి హాని తలపెట్టకూడదంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిరంతరం తాము పులి కదలికలను పర్యవేక్షిస్తున్నామని, అలాగే ఈ ప్రాంతంలోకి కొత్తగా వచ్చే వారిపైన కూడా నిఘా ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.
Also read:
Viral Video: పెళ్లి వేడుకలో అమ్మమ్మ డ్యాన్స్ అదరగొట్టేసిందిగా.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..!
Sidhu Video: ఇమ్రాన్ ఖాన్‌ను ‘పెద్దన్న’గా సంబోధించిన సిద్ధూ.. వీడియో షేర్ చేసిన బీజేపీ
Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై నాగ్ ఫైర్.. సిరి పరువు తీసి.. షణ్ముఖ్‌కు క్లాస్..