Telangana: ‘నేనేం పాపం చేశాను.. నాన్నా’ భార్యపై అనుమానంతో ఓ తండ్రి ఘాతుకం..
పచ్చగా సాగుతోన్న వారి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో అభంశుభం తెలియని రెండేళ్ల కుమారుడిని పొట్టనపెట్టుకున్నాడో కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అయిజ పట్టణంలో నివాసముంటున్న భార్గవకు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో..
నాగర్‌కర్నూల్, జనవరి 5: పచ్చగా సాగుతోన్న వారి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో అభంశుభం తెలియని రెండేళ్ల కుమారుడిని పొట్టనపెట్టుకున్నాడో కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అయిజ పట్టణంలో నివాసముంటున్న భార్గవకు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో 2019లో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమార్తె నయనిక, కుమారుడు నందకిశోర్ (2) ఉన్నారు. కొన్నేళ్లపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొంతకాలంగా పొరపొచ్చాలు రాసాగాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భార్గవ తరచూ భార్యతో గొడవ పడేవాడు. భర్త వేధింపులు తాళలేక భార్య శ్రావణి పదిరోజుల క్రితం కుమార్తె, కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లేందుకు యత్నించింది. దీంతో అడ్డు కున్న భార్గవ ఆమె వద్ద నుంచి కుమారుడు నందకిషోర్‌ను లాక్కున్నాడు. దీంతో ఆమె కూతురు నయనికను తీసుకొని వెళ్లిపోయింది.
నిత్యం కుమారుడు నందకిషోర్ తల్లి కోసం ఏడుస్తుండేవాడు. పిల్లవాడి ఏడుపు భరించలేకపోయిన భార్గవ.. పసివాడనే కనికరం లేకుండా కుమారుడికి నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టసాగాడు. పదిరోజులుగా భార్య లేకపోవడంతో భార్గవ మానసికంగా కుంగిపోయాడు. దీంతో వారం క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతని తల్లి గమనించి వెంటనే వడ్లకుమారి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా కోలుకున్నాడు.
ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత భార్గవ రెండేళ్ల తన కుమారుడు నందకిషోర్‌కు ఎలుకల మందు తాగించి, తానూ తాగాడు. గురువారం ఉదయం తల్లి కుమారి నిద్ర లేచేసరికే కొడుకు, మనవడు అపస్మారక స్థితిలో ఉండడం గమనించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే పసివాడు నందకిషోర్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భార్గవ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న శాంతినగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.