జడ్చర్ల / మే 25: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్.. తెలంగాణలోనూ విజయబావుటా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం తరచుగా సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒకవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు పీసీసీ నేతృత్వంలో సభలతో జనానికి చేరువ కావాలని నిర్ణయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భాంగా మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లలో భారీ సభను ఏర్పాటు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖ్, మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఈ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 10 హామీలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించేశారు. ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు, రేషన్‌షాపులో 9రకాల నిత్యావసర సరుకులు, 500లకే గ్యాస్ సిలిండర్, ఫీజు రియంబర్స్‌మెంట్, LKG నుంచి PG వరకు ఉచిత నిర్భంద విద్య, మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు, 4వేల నిరుద్యోగ భృతి, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు, 2లక్షల రైతు రుణమాఫీ, భూమిలేని పేదలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ పంచిన అటవీ భూములను కేసీఆర్ గుంజుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పాదయాత్రలో పోడు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారని వెల్లడించారు. BRS ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్నారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని, ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ లిటిల్ మేనిఫెస్టో ప్రకటించి.. తెలంగాణలో ఎన్నికల హీట్ మరింత పెంచేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..