AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం.. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో హై-టెన్షన్‌!

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో టెన్షన్‌ వాతావరణం కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి కేంద్ర బలగాలు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో హెలికాప్టర్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. బీజాపుర్‌ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.

కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం.. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో హై-టెన్షన్‌!
Major Security Operation In Bijapur
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 24, 2025 | 3:25 PM

Share

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో టెన్షన్‌ వాతావరణం కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి కేంద్ర బలగాలు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో హెలికాప్టర్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. బీజాపుర్‌ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బీజాపుర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తోంది. వీరిలో కమాండర్‌ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. భీమవరంపాడు, పూజారీ కాంకేర్‌, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కూంబింగ్‌ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.

రెండు రోజులుగా ఈ కూంబింగ్‌ కొనసాగుతోంది. మందుపాతరలు అమర్చామని ఇప్పటికే మావోయిస్టులు లేఖల ద్వారా ప్రకటించారు. ప్రజలు ఎవరూ అటవీ ప్రాంతంలోకి రావొద్దని హెచ్చరించారు. దీంతో గాలింపు అత్యంత అప్రమత్తంగా కొనసాగుతోంది. బుధవారం(ఏప్రిల్ 23) 3 వేల మందితో కూంబింగ్‌ చేపట్టగా.. గురువారం(ఏప్రిల్ 24) ఉదయం అదనంగా మరో 2 వేల మందిని రప్పించారు. దీంతో ఈ 5 వేల మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టల అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల ఏరియాను కలిపే గ్రామాలకు రాకపోకలను సైతం బలగాలు మూసివేశాయి. మరోవైపు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటున్న పౌరహక్కుల నేతలు కాల్పులు తక్షణం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఏజెన్సీ గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..