LPG Gas: షాకింగ్ న్యూస్.. ఈనెల 29 నుంచి తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ హోమ్ డెలివరీ నిలిపివేత.. ఎందుకంటే..!
LPG Gas Home Delivery: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ..
LPG Gas Home Delivery: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ డీలర్ల కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల హోమ్ డెలివరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎల్పీజీ డీలర్ల కార్యవర్గ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్పీజీ సిబ్బంది.. ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనాను సైతం లెక్క చేయకుండా అందరికి ప్రతి రోజు గ్యాస్ సిలిండర్లను హోమ్ డెలివరీ చేస్తున్నారు. దీంతో డెలివరీ బాయ్స్, సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎల్పీజీ సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలంగాణ ఎల్పీజీ డీలర్ల అధికార ప్రతినిధి వేణుగోపాల్ కోరారు. అయితే కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే తమ 40 మంది సిబ్బంది మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తిస్తేనే సిలిండర్లను డోర్ డెలివరీ చేయగలమని ఆయన స్పష్టం చేశారు. కస్టమర్లకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ సిబ్బంది హోమ్ డెలివరీ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని ఫ్రంట్‌వారియర్స్‌గా గుర్తించి కరోనా టీకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.