వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దేశంలో 400 సీట్లు సాధించే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పార్టీ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసింది. ఇటు తెలంగాణలోనూ డబుల్ డిజిట్ పార్లమెంటరీ స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే తక్కువలో తక్కువ 10 స్థానాలు గెలవాలన్నది కమలనాథుల లక్ష్యం. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దశాబ్ధాలుగా తమకు అందని ద్రాక్షగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంపైనా కమలనాథులు కన్నేశారు. హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. దీని కోసం వారు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం మొదటి నుంచీ మజ్లీస్ పార్టీ (ఎంఐఎం)కి కంచుకోటగా ఉంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వరుసగా నాలుగుసార్లు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. 2004 నుంచి ఈ నియోజకవర్గానికి అసద్ ప్రాతినిధ్యంవహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జే భగవంత్ రావుపై 2.82 లక్షల కోట్ల మెజార్టీతో అసదుద్దీన్ విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీకి 5.17 లక్షల ఓట్లు దక్కగా.. డాక్టర్ భగవంత్ రావుకు 2.35 లక్షల ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి పీ శ్రీకాంత్‌కు 63 వేల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌కు 49 వేల ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లోనూ డాక్టర్ భగవంత్ రావుపై 2.02...