Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress MP Seats: తుది దశకు కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా ఎంపిక

తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ మాత్రం రెండు విడతల్లో 9మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరో 8 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఆ 8 స్థానాల కోసం 16మంది ఆశావాహులు పోటీపడుతున్నారు. మరి అధిష్ఠానం ఎవరిని ఫైనల్ చేస్తుంది? వాళ్ల పేర్లను ఎప్పుడు అనౌన్స్‌ చేయబోతోంది?

Congress MP Seats: తుది దశకు కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా ఎంపిక
Telangana Congress
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2024 | 10:17 AM

తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ మాత్రం రెండు విడతల్లో 9మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరో 8 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఆ 8 స్థానాల కోసం 16మంది ఆశావాహులు పోటీపడుతున్నారు. మరి అధిష్ఠానం ఎవరిని ఫైనల్ చేస్తుంది? వాళ్ల పేర్లను ఎప్పుడు అనౌన్స్‌ చేయబోతోంది? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అబ్ కీ బార్.. చార్ సౌ పార్.. అంటూ దేశవ్యాప్తంగా నినదిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ టార్గెట్‌తో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అటు బీఆర్‌ఎస్‌ సుదీర్ఘ కసరత్తు, చర్చలు, వడపోతల అనంతరం విడతల వారీగా అభ్యర్థులందరి పేర్లను వెల్లడించింది. అయితే కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో వెనకబడి పోయింది. ఇప్పటిదాకా రెండు లిస్ట్‌లు ప్రకటించింది. అందులో 9మంది పేర్లను మాత్రమే ఫైనల్ చేసింది. మిగతా 8 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఆ సెగ్మెంట్‌లలో ఆశావహుల మధ్య పోటాపోటీ నెలకొంది.

ఆత్రం సుగుణ.. డాక్టర్ సుమలత.. వీళ్లిద్దరూ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీటు కేటాయిస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తామని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిజామాబాద్‌లో జీవన్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది. ఎవరి స్టైయిల్‌లో వాళ్లు అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కరీంనగర్‌ స్థానం తమకే కేటాయించాలని ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్‌ పట్టుబడుతున్నారు. ఇద్దరిలో ప్రవీణ్‌ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

వరంగల్‌ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ మరోసారి రేసులో నిలిచారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన దయాకర్‌.. ఛాన్స్ ఇస్తే గెలుపుని కానుకగా ఇస్తానని ధీమాగా చెబుతున్నారు. అటు దొమ్మటి సాంబయ్య తనకే సిటివ్వాలని పట్టుబడుతున్నారు. ఖమ్మం బరిలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హాట్‌ సీట్ కోసం కూల్‌గా ప్రయత్నాలు చేస్తున్నారట ప్రసాద్ రెడ్డి. అయితే ఇదే స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని.

ఇక భువనగిరి స్థానంపై చాలా ఆశలు పెట్టుకున్నారు చామల కిరణ్‌ కుమార్‌. మొన్నటిదాకా కోమటిరెడ్డి లక్ష్మి బరిలో ఉంటారని ప్రచారం జరిగినా.. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఈ క్రమంలోనే నేనున్నానంటూ సీన్‌లోకొచ్చారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. మల్కాజిగిరి సీటు ఆశలు గల్లంతు కావడంతో భువనగిరికి షిఫ్ట్ కావాలని డిసైడ్ అయ్యారట. దీంతో చామల, కంచర్ల మధ్య పోటీ నెలకొంది. మెదక్‌లో మైనంపల్లి హన్మంతరావు – నీలం మధు ఎవరి స్టైయిల్‌లో వాళ్లు సీటు కోసం పైరవీలు చేస్తున్నారట. అటు హైదరాబాద్‌ సెగ్మెంట్‌లో షబానా తబుస్సుం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. అలాగే అలీ మస్కటి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.

అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. వ్యక్తిగత పరపతి, ఆర్థిక పరిస్థితి, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా ఎంపిక ఉంటుందంటున్నారు. కాస్త లేట్ అయినా బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ధీటైన నేతలు బరిలో నిలుస్తారని నమ్మకంగా చెబుతున్నారు. ఫైనల్‌గా పార్లమెంట్ బరిలో ట్రయాంగిల్‌ ఫైట్‌ రసవత్తంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..