Lok Sabha Election: నడిగడ్డ ప్రజాప్రతినిధులకు సవాల్‌గా మారిన పార్లమెంట్ ఎన్నికలు.. గంపెడు ఆశలు పెట్టుకున్న గులాబీ పార్టీ

| Edited By: Balaraju Goud

May 02, 2024 | 12:08 PM

ఆ సీటు గెలుపు అంశంలో గులాబీ పార్టీ నడిగడ్డపైనే గంపెడు అశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన రెండు స్థానాలు అవే కావడంతో అందరి కళ్లు ఆ రెండు నియోజకవర్గాలపైనే పడింది. ఎమ్మెల్యేలకు తోడు మరో ఎమ్మెల్సీ సైతం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆశలు మరింత బలపడ్డాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికలు నడిగడ్డ ప్రజాప్రతినిధులకు సవాల్ గా మారాయి.

Lok Sabha Election: నడిగడ్డ ప్రజాప్రతినిధులకు సవాల్‌గా మారిన పార్లమెంట్ ఎన్నికలు.. గంపెడు ఆశలు పెట్టుకున్న గులాబీ పార్టీ
Brs Kcr
Follow us on

ఆ సీటు గెలుపు అంశంలో గులాబీ పార్టీ నడిగడ్డపైనే గంపెడు అశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన రెండు స్థానాలు అవే కావడంతో అందరి కళ్లు ఆ రెండు నియోజకవర్గాలపైనే పడింది. ఎమ్మెల్యేలకు తోడు మరో ఎమ్మెల్సీ సైతం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆశలు మరింత బలపడ్డాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికలు నడిగడ్డ ప్రజాప్రతినిధులకు సవాల్ గా మారాయి.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ పరిధిలోని నడిగడ్డ ప్రాంతానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి ఈ ఎన్నికలు పెద్ద సవాల్ విసురుతున్నాయి. రిజర్వడ్ స్థానం కావడంతో పాటు చివరి నిమిషంలో బలమైన అభ్యర్థి బరిలోకి దిగడంతో ఎలాగైన విజయం సాధించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకు అన్ని రకాల ప్రయత్నాలు, వ్యూహాలు అమలు చేస్తోంది గులాబీ పార్టీ. ప్రచార జోరును అదే స్థాయిలో కొనసాగిస్తోంది. ఇప్పటికే అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తున్నారు. దీనికి తోడు ఇటివలే అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కూడా పార్లమెంట్ పరిధిలో పూర్తి కావడంతో పార్టీ కేడర్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.

అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు సైతం ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ఓట్లు పడేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గతంతో పోల్చితే తాజా పరిణామాలు పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమాను పెంచాయి. దీంతో నిన్నా, మొన్నటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలు అంతా ఎన్నికల రణరంగంలోకి దిగారు. పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నడిగడ్డలోని రెండు నియోజకవర్గాలు అలంపూర్, గద్వాల్ పైన భారీ మెజారీటీని ఆశిస్తున్నారు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికే నడిగడ్డలో పార్టీ బలంగా కనిపిస్తుండటంతో కొద్దిగా కష్టపడితే వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించవచ్చని భావిస్తున్నారు.

2014లో గెలిచింది రెండే సీట్లు:

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది కేవలం రెండు స్థానాలు మాత్రమే. అవి కూడా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. అభ్యర్థి స్వస్థలం అలంపూర్ నియోజకవర్గంలోనే ఉండడం, అదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. అలాగే పక్కనే గద్వాల్ లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. దీంతో ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచే బీఆర్ఎస్ అధిష్టానం తిరుగులేని ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను ఓటర్లు వేరుగా చూడడం కొంత ఇబ్బందిగా కనిపిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో నడిగడ్డ ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంచనా వేయలేక పోతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది ఒక ఎత్తైతే ఎంపీ ఎన్నికల్లో పార్టీ పెట్టుకున్న అంచనాలు రీచ్ కావడం మరో ఎత్తు అని ఫీల్ అవుతున్నారట. ఏది ఏమైనా పార్టీ అభ్యర్థిని గెలపించేందుకు తమ వంతు కష్టపడుతున్నారట నడిగడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…