తెలంగాణలో లాక్ డౌన్ జూన్ 9 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగింపు చేసింది. అయితే ఈ లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయి బడుగు, బలహీన పేద వర్గాలు అర్థాకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఆసరాగా తెలంగాణ సర్కార్ నిలుస్తుంది. పేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జూన్, జూలైలకు కలిపి ప్రతీ ఒక్కరికి 20కిలోల ఉచిత బియ్యాన్ని అందించనుంది. ప్రతినెలా అందించే బియ్యానికి 10కిలోలు అదనంగా జతచేసి జూన్ నెలలో లక్షా 78వేల మెట్రిక్ టన్నులకు అదనంగా 2లక్షల 53వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వనున్నారు.
జూలైలో ఐదు కిలోలను ఫ్రీగా అందించాలని సర్కార్ నిర్ణయించింది. జూన్‌లో అందించే రేషన్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53లక్షల 56వేల కార్డులకు అందించే 15 కేజీలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33లక్షల 86వేల కార్డుదారులకు 15 కిలోలు ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగా అందజేయనుంది. ఫస్ట్ ఫేజ్ లాక్‌డౌన్‌లో మే నుంచి అక్టోబర్ వరకూ ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గతంలో 12 కిలోల బియ్యం ఇచ్చిన విధంగానే ఈసారి 15 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి రాని లబ్ధిదారులకు సైతం తెలంగాణ సర్కార్ ఈ ప్రయోజనాన్ని అందించనుంది.
Also Read: లారీ బ్రేక్ ఫెయిల్.. రివర్స్ గేరులో 3 కిమీలు వెనక్కి.. చివరకు ఏం జరిగిందంటే