
హైదరాబాద్ పరిసర ప్రాంతాలను చిరుత భయం వెంటాడుతోంది. గండిపేటలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. వారం క్రితం గ్రేహౌండ్స్ అటవీ ప్రాంతంలో చిరుత పులిని చూశారు పోలీసు సిబ్బంది. E.I.P.L రివర్ ఎడ్జ్ విల్లాస్ పక్కన కొండపై చిరుతను చూశారు విల్లా యజమాని. తన ఫోన్‌తో చిరుత ఫోటోను తీశారు. దీంతో అది వైరల్ గా మారింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో రోజంతా చిరుత కోసం గాలించారు. చిరుత పులి జాడ దొరకకపోవటంతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేకలను ఎరగా వేసి 4 బోన్లు, 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొన్న ఉదయం 7 గంటల 40 నిమిషాలకు రోడ్డు దాటుతుండగా చిరుత కదలికలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో రాత్రి వేళల్లో గండిపేట, మంచిరేవుల ప్రాంతంలో ఒంటరిగా తిరగొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
అటవీశాఖ సిబ్బంది చిరుత పులి ఆచూకీ కోసం 8 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత పులిని బంధించేందుకు నాలుగు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ చిరుత జనావాసాల్లో తిరుగుతుండడంతో రాత్రి పూట ప్రజలు బయటకురావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిరుత సంచారంతో మంచిరేవుల చుట్టుపక్కల ప్రాంతంలోని జనం భయం భయంగా గడుపుతున్నారు. మొత్తం 60కిలోమీటల రేడియస్‌లో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మళ్లీ ఆ ఏరియాకి చిరుత రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కదలికలను బట్టి ట్రాప్ కెమెరాలను, బోన్లను వేర్వేరు ప్రదేశాలకు మారుస్తున్నారు.
ఇదొక్కటే కాదు… ఈ నెల 11న బాలాపూర్‌లోని DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలో రెండు చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపింది. ఒక శునకం అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటంతో చిరుత పులులు ఉన్నాయనే అనుమానాలు మరింత బలపడ్డాయి. అప్రమత్తమైన డిఫెన్స్ అధికారులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీర్స్… రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో చిరుత పాదముద్రలు గుర్తించారు. రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై డిఫెన్స్ లాబరేటరీ స్కూల్ ప్రిన్సిపల్ ఓ నోట్ కూడా విడుదల చేశారు.. రెండు చిరుతల సంచారం నేపథ్యంలో.. విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసు జారీ చేశారు.. విద్యార్థులను తీసుకురావడానికి, తీసుకెళ్లే సమయంలో అప్రమత్తం ఉండాలని.. సూచించారు.
ఏదో మారుమూల ప్రాంతాల్లో కాదు… సిటీ సమీప ప్రాంతాలకు చిరుతలు ఎంట్రీ ఇవ్వడంతో శివారు ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించడం ఇదేం మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న నివాస, పారిశ్రామిక ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. ఆహారం, నీటి అన్వేషణలో మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇది మానవ-వన్యప్రాణుల సంఘర్షణకు దారితీస్తోంది.