వేములవాడ, డిసెంబర్ 25: డబ్బున్న వ్యక్తులతో సాన్నిహిత్యంగా మెలుగుతూ, అనంతరం బ్లాక్ మెయిల్ చేస్తూ పలువురిని ముప్పుతిప్పలు పెట్టి దాదాపు రూ. కోటి వరకు దండుకుంది ఓ మహిళా హోం గార్డు. ఏకంగా పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ వ్యవహరించిన తీరు ఆ శాఖకే కళంకం తెచ్చిపెట్టేలా ఉంది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
వేములవాడలో హోంగార్డుగా పనిచేస్తుండగా రాజన్న ఆలయ అనే మహిళ.. అదే జిల్లాలో ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన శేఖర్‌తో కొంత కాలం క్రితం పరిచయం పెంచుకుంది. తన భర్త ఆరోగ్యం బాగాలేదని నమ్మబలికి అతని నుంచి రూ. 5లక్షలు వసూలు చేసింది. కొన్ని రోజుల తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శేఖర్ అడిగాడు. దీంతో సదరు హోం గార్డు శేఖర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. వాటి ద్వారా బ్లాక్ మెయిల్‌కి దిగింది. దీంతో బాధితుడు వేములవాడ ఠాణాలో డిసెంబర్ 5న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఆ తర్వాత వేములవాడ రూరల్ మండలం అనుపురానికి చెందిన పరశురామ్‌తో లేడీ హోంగార్డు పరిచయం పెంచుకొని ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి రూ.45 లక్షలు కాజేసింది. మోసపోయిన పరశురాం అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఇద్దరు న్యాయవాదులు కలిసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ మరో రూ.15 లక్షలు డిమాండ్ చేయడంతో వేములవాడ ఠాణా, హైదరాబాద్‌లో డిసెంబర్ 3న వేరు వేరు కేసులు నమోదయ్యాయి. మరో ఘటనలో వేములవాడలోని సుభాష్‌నగర్‌లో సుజాతతో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నది. ఖరీదైన కార్లలో ఆమె దగ్గరికి వస్తూ పరిచయం పెంచుకుని, అప్పుడప్పుడూ రూ.9 లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ ముఖం చాటేయసాగింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు డిసెంబర్ 11న వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా ఉన్న పలువురితో పరిచయాలు పెంచుకుని ఈ కిలేడీ కానిస్టేబుల్ రూ. కోటి దాకా లూటీ చేసింది. మొత్తం 8 కేసులు ఆమెపై నమోదయ్యాయి.