AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండా సురేఖపై వేటు..? అప్పటిలోపే కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలపై చర్యలకు అధిష్టానం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిల వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకున్న హైకమాండ్, అసెంబ్లీ సమావేశాల లోపే ఈ పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశిస్తారా? లేక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పేరుతో నేరుగా వేటు వేస్తారా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కొండా సురేఖపై వేటు..? అప్పటిలోపే కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం..!
Konda Surekha Controversy
Krishna S
|

Updated on: Aug 27, 2026 | 8:38 AM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెల మొదటి వారంలోనే, ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ అంశానికి ముగింపు పలకాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, వివాదాలపై పీసీసీ సమర్పించిన నివేదికలు ఇప్పటికే హైకమాండ్‌కు చేరాయి. పార్టీకి జరిగిన నష్టం, తాజా పరిస్థితులన్నింటినీ అధిష్ఠానం అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం నాటికి తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం బెంగళూరు నుంచి హస్తినకు రానున్నారు. కీలక నేతలిద్దరూ ఢిల్లీకి చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా రాష్ట్ర ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రానుంది.

మరోవైపు బెంగళూరులో మల్లికార్జున్ ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమై తాజా పరిస్థితులను వివరించారు. కొండా సురేఖ వ్యవహారశైలి వల్ల పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకే మాటతో ఉన్నారని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఖర్గే, రాష్ట్ర నాయకత్వం పంపిన నివేదికను ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించానని స్పష్టం చేశారు.

ఏఐసీసీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి కొండా సురేఖను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె రాజీనామాకు నిరాకరిస్తే, మంత్రివర్గం నుంచి నేరుగా బర్తరఫ్ చేసే అవకాశాలు లేకపోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే యోచనలో కూడా అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే వ్యూహాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

మరోవైపు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపైనా పార్టీ నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం, భట్టి, పీసీసీ చీఫ్‌లతో అధిష్ఠానం జరిపే ఉన్నత స్థాయి భేటీ తర్వాతే తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాల లోపే ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, ప్రతిపక్షాలకు ఎలాంటి అస్త్రం చిక్కకుండా పార్టీని గాడిన పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

Follow Us