Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరంగల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటి

మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. కొండా ఫ్యామిలీపై పలు ఆరోపణలు రాగా.. వారి కూతురు ఏకంగా పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్నానంటూ వ్యాఖ్యానించి పొలిటికల్ హీట్ పెంచారు. ఈ క్రమంలో కొండా దంపతులు మీనాక్షిని కలిశారు. వరంగల్ రాజకీయాలకు సంబంధించి పలు కీలక విషయాలను మీనాక్షికి వివరించారు.

వరంగల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటి
Konda Surekha
Krishna S
|

Updated on: Jul 03, 2025 | 11:38 AM

Share

తెలంగాణలో వరంగల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో సమంత విషయంలో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వివాదస్పద చేయగా.. ఇటీవలే ఆమె భర్త కొండా మురళీ.. ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామంటూ  వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరదీశారు. వీళ్ల వ్యాఖ్యలతో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకోగా.. రెండు రోజుల క్రితం వారి కూతురు కొండా సుస్మిత మరో వివాదానికి తెరలేపారు. పరకాల నుంచి పోటీకి సిద్ధమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచారు. ఈ క్రమంలో గురువారం కొండా దంపతులు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీనాక్షికి ఏకంగా 16 పేజీల నివేదికను వారు అందజేశారు. వరంగల్ జిల్లా గ్రూప్ రాజకీయాల గురించి అందులో వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కొండా మురళీ.. పనిచేసే వాళ్లపైనే రాళ్లు విసురుతారని అన్నారు. గ్రూప్ రాజకీయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని కొండా మురళీ చెప్పారు. మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాకు సంబంధించిన కొంత మంది పార్టీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారిన ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకోవడం తన బాధ్యత అని అన్నారు. తాను వెనకబడిన వర్గాల నుంచి వచ్చానని.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కూతురు వ్యాఖ్యలపై క్లారిటీ..

తమ కూతురు వ్యాఖ్యలపై కొండా దంపతులు స్పందించారు. తన కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో తనకు తెలియదని కొండా మురళీ అన్నారు. తన కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని.. సుస్మిత ఏమి అనుకుంటుందో తనకు తెలియదన్నారు. కొండా సురేఖ మాత్రం.. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అధికారం తన కూతురుకు ఉందని వ్యాఖ్యానించారు. తన ఆలోచనను కాదనలేమని.. అయితే పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలని చెప్పారు. కాగా గత ఎన్నికల్లో పరకాల నుంచి సుస్మిత పోటీ చేయాలనుకున్నప్పటికీ అధిష్ఠానం ఆ టికెట్ ను రేవూరి ప్రకాశ్ రెడ్డికి కేటాయించడంతో కొండా ఫ్యామిలీ అసంతృప్తికి గురైంది.