Munugode Bypoll: మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో నేతలు..

మునుగోడు ఉపసమరంలో.. వేడి పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తుండటంతో.. ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇవాళ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

Munugode Bypoll: మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో నేతలు..
Komatireddy Rajagopal Reddy

Updated on: Oct 10, 2022 | 3:52 PM

మునుగోడు ఉపసమరంలో.. వేడి పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తుండటంతో.. ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇవాళ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌చుగ్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా కీలక నేతలంతా ఈ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా కార్యకర్తలు కోలాటం ఆడుతూ.. బతుకమ్మలు, బోనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. 2014, 2018 ఎన్నికల్లో మునుగోడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని విమర్శించారు బండి సంజయ్‌. టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాంలో ఇరుక్కుంది నిజం కదా.. దమ్ముంటే కేసీఅర్ చర్చకు సిద్ధమా ? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయన్నారు. దుబ్బాక,హుజురాబాద్ ఫలితాలే మునుగోడులో కూడా రిపీట్ అవుతాయని స్పష్టంచేశారు. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టర్ అని తెలిపారు. మునుగోడు అభివృద్ధి జరగలేదని, ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకే రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. రాజీనామా తర్వాతే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

కాంట్రాక్టుల కోసమే బీజేపీకి అమ్ముడుపోయారంటూ.. టీఆర్‌ఎస్‌ నేతలు తనపై చేస్తున్న ఆరోపణల్ని మరోసారి ఖండించారు రాజగోపాల్‌రెడ్డి. ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయానికి తడిబట్టలతో వస్తానని.. దీనికి కేటీఆర్‌, కేసీఆర్‌ సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. కేసీఅర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలంటే మునుగోడులో బీజేపీ గెలుపు అవసరమన్నారు. ఉప ఎన్నిక రాగానే సంక్షేమ పథకాల పేరుతో టీఆరెఎస్ శ్రేణులు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. అవసరం తీరాకా అన్నీ మర్చిపోతారంటూ ధ్వజమెత్తారు. అక్రమ సంపాదనతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ గెలవాలని చూస్తుందన్నారు.

బీజేపీ గెలుపు ఖాయం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఇవి కూడా చదవండి

తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో లేరంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలిపే విధంగా తెలంగాణ పేరును కూడా తీసేశారన్నారు. సీఎం కేసీఆర్ అహంకారాన్ని దెబ్బతీయడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన హుజురాబాద్, దుబ్బాకలో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని.. మునుగోడులో ఎంత డబ్బు, మద్యం పంచినా ఇక్కడి ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని.. బీజేపీ గెలుపు ఖాయమని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..