బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి కౌంటరిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధాలు చెప్పి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ‘మొన్నటిదాకా.. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా అన్నా.. సహాయం చేయమని నన్ను అడిగిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. ఇవ్వాల నాపై కామెంట్లు చేస్తున్నారు. మాకే సరిపడా మెజార్టీ ఉంది. ఎవ్వరిని చేర్చుకోవాలనే ఉద్దేశం పార్టీకి లేదని చెప్పినా. అది మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. నితిన్ గడ్కరీకి, అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పినా అని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నరు.నేను మహేశ్వర్ రెడ్డికి ఒక్కటే సవాల్ చేస్తున్నా. ఆయనకు దమ్ముంటే నితిన్ గడ్కరిని, అమిత్ షాను తీసుకొని భాగ్యలక్ష్మీ టెంపుల్ కు రమ్మనండి.. నేను వస్తా ప్రమాణం చేద్దాం. ఐదేండ్లకో పార్టీ మారే.. గాలిమాటల మహేశ్వర్ రెడ్డి.. రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జెండా మార్చని నాపై విమర్శలు చేస్తారా? ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, మధ్యలో బీఆర్ఎస్ తో టచ్.. ఇట్ల ఒక్కటి కాదు ఆయన పోని పార్టీ ఈ రాష్ట్రంలో లేదు. ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు.. చేరికల కమిటీకి ఛైర్మన్ ను కూడా నియమించారు. అయినా ఒక్క కార్పోరేటర్ కూడా ఆ పార్టీలో చేరలేదు. ఆర్ధికంగా లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి నడిపిస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఏదేదో మాటలు అంటున్నారు’.
‘నేను షిండేను అవునో కాదు భగవంతునికి ఎరుకకానీ.. మహేశ్వర్ రెడ్డి మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్ధన్ రెడ్డి. అవకాశం ఇస్తే.. రాత్రికి రాత్రే పార్టీ మారుతానని బతిమాలినోడు.. కాంగ్రెస్ లో ఎవ్వరు సప్పుడు చెయ్యకపోయేసరికి నాపై కామెంట్లు చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనక పెద్ద కుట్ర ఉంది. కాంగ్రెస్ లో పుట్టినా.. కాంగ్రెస్ జెండాతోనే పోతా. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి’ అంటూ మహేశ్వర్ రెడ్డికి కౌంటరిచ్చారు మంత్రి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…