కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. కొల్లాపూర్ నియోజకవర్గం (Kollapur Assembly Election).. తెలంగాణలో అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటైన కొల్లాపూర్ నియోజకవర్గంలో 2,34,167 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, కోడైర్, పెద్దకొత్తపల్లె, పెంట్లవెల్లి మండలాలు.. వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, పంగల్, చిన్నంబావి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. 1952 నుంచి ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ అభ్యర్థులు ఇక్కడి నుంచి 9సార్లు విజయం సాధించగా, బీఆర్ఎస్ రెండుసార్లు, టీడీపీ ఒకసారి విజయం సాధించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినా.. ఇక్కడి ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు వెలమ సామాజిక వర్గ నేతలు, మూడుసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత విజయం సాధించారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో..
1999 నుంచి వరుసగా ఐదు సార్లు కొల్లాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌తో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో జూపల్లి మంత్రిగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ పార్టీకి అనుకూల పవనాలు వీసినా.. కొల్లాపూర్‌లో ఓటర్ల విలక్షణ తీర్పుతో మంత్రి హోదాలో ఉన్న జూపల్లి కృష్ణారావు ఓడిపోవడం నాడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి 12,546 ఓట్ల మెజార్టీతో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డికి 80617 ఓట్లు పోల్ కాగా.. జూపల్లికి 68071 ఓట్లు దక్కాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అల్లెని సుధాకర్ రావుకు 13,156 ఓట్లు దక్కాయి.
ఆ తర్వాతటి రాజకీయ పరిణామాల్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. గత కొన్నేళ్లుగానే బీఆర్ఎస్ అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్న జూపల్లి.. ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన అభ్యర్థుల పార్టీలు తారుమారయ్యాయి. బీజేపీ తరఫున ఆల్లెని సుధాకర్ రావు ఈ సారి కూడా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అలాగే యూట్యూబర్ బర్రెలక్క (కర్నె శిరీష) ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తుండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై నెలకొంది. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క బరిలో నిలవడంతో ఇక్కడ చదుర్ముఖ పోటీ నెలకొంది. బర్రెలక్క ఎవరి గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మొన్నటి పోలింగ్‌లో కొల్లాపూర్ నియోజకవర్గంలో 81.42 శాతం పోలింగ్ నమోదయ్యింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్