AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: ఎన్టీపీసీ పవర్ అక్కర్లేదా? కాంగ్రెస్ సర్కార్ అలసత్వానికి ప్రజలెందుకు నష్టపోవాలి? : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రామగుండంలో ప్రతిపాదిత మరో 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ల PPAపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఇది తగదంటూ పేర్కొన్నారు.

Kishan Reddy: ఎన్టీపీసీ పవర్ అక్కర్లేదా? కాంగ్రెస్ సర్కార్ అలసత్వానికి ప్రజలెందుకు నష్టపోవాలి? : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Revanth Reddy Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2024 | 6:56 PM

Share

తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రామగుండంలో ప్రతిపాదిత మరో 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ల PPAపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఇది తగదంటూ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్ వేరే రాష్ట్రాలకు పోతే.. తెలంగాణకు తీవ్ర నష్టమని.. సర్కారు అలసత్వానికి.. ప్రజలెందుకు నష్టపోవాలి? అంటూ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

‘‘దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా.. మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను NTPC ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో.. మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 3 అక్టోబర్ 2023నాడు, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 4 మార్చ్ 2024నాడు ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్ లో 85% విద్యుత్ ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారు.

ఈ 4వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ NTPCతో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (TSTRANSCO) విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై NTPC పని ప్రారంభిస్తుంది.

ఒకవైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. STPP-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే.. PPA విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. 5 అక్టోబర్, 2023 నాడు, 9 జనవరి, 2024 నాడు, 29 జనవరి, 2024 నాడు.. ఆ తర్వాత మొన్న 29 ఏప్రిల్, 2024 నాడు లేఖలు రాస్తే.. వీటికి TSTRANSCO నుంచి సమాధానం లభించలేదు.

ఇన్నిసార్లు లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న STPP-II ప్రాజెక్టునుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని NTPC లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో.. దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నది NTPC రాసిన లేఖల సారాంశం.

30 మే 2024 నాడు దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్చి 2024లో తెలంగాణలో గరిష్ఠంగా (పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ ను అందించేందుకు.. రెండోదశ NTPC పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది.

తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా.. దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందనేది మరోసారి నిరూపితమైంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం.. NTPC రాస్తున్న లేఖలపై స్పందించి.. PPA చేసుకుంటే అంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది. దీన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.’’ అంటూ కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..