
అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో ఐడీలు క్రియేట్ చేసి తనకు ఎవరూ లేరు. అనాథను అంటూ.. చదువుకునేందుకు డబ్బులు కావాలంటూ వేరేవారి బ్యాంక్ అకౌంట్స్ పంపేవాడు. వాటికి తన ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుని డబ్బులు తీసుకునే వాడు. పలువురిని మోసం చేసిన కేటుగాడు హరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన గడబోయిన హరీష్ అనే వ్యక్తి వాటర్ ప్లాంట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. అమ్మాయిల గొంతులా మార్చి మాట్లాడుతూ యువకులను ఆకర్షించేవాడు. గడబోయిన హరీష్ ఇంటి దగ్గరే ఉంటూ టెంట్ హౌస్, మినిరల్ వాటర్ ప్లాంట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా అబ్బాయిలను టార్గెట్ చేసి ఫేక్ ఐడీలతో డబ్బులు సంపాదించడం ప్రధాన భృతిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ట్రాలీ నడిపే యువకుడి మధు అకౌంట్ ఉపయోగించి డబ్బులు డిపాజిట్ చేయించుకునేవాడు. ఈ విషయం ఆ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి బయట పెట్టడంతో హరీష్ గుట్టు రట్టయింది. పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది.
కామేపల్లి మండలంలోని చుట్టుపక్క గ్రామాల్లో మొత్తం 216 మందిని మోసం చేసి సుమారు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న హరీష్ కోసం పోలీసులు గాలించి ఖమ్మంలో పట్టుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కేటుగాడు మోసాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి