AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఖమ్మంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు..
Khammam Bus Accident
SN Pasha
|

Updated on: Jun 08, 2026 | 7:15 AM

Share

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో ముగ్గురు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

స్థానికులు, క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామం నుంచి కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగపాలెం, రాఘవాపురం, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపైకి చేరుకున్న బస్సు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

గాయపడిన వారిలో సత్తుపల్లికి చెందిన ఎం. శిరీష, ఎం. శివగణేశ్, పి.మల్లిక, చక్కపల్లికి చెందిన శ్రీనివాసరావు, పావని, రాఘవాపురానికి చెందిన సుస్మిత, యువన్, విజయరాయికి చెందిన ప్రణీత్, స్వప్న, బి. నరసింహ, లింగపాలెంకు చెందిన తాతిన బాలాజీ, కుంచపర్తికి చెందిన ఆర్. రామకృష్ణ ఉన్నారు. వీరందరికీ స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా రైల్వే వంతెనపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us