
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కన్నేశాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తమ పార్టీలోకి 20మంది ఎమ్మెల్యేలు వస్తారంటుంటే.. తామేం తక్కువ కాదంటోంది బీజేపీ. తమకు 8మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు టచ్‌లో ఉన్నారంటోంది. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజంగానే పార్టీ మారే పరిస్థితి ఉందా?. గులాబీ బాస్ ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నారు? ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు అధికార పక్షం. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా మారింది బీఆర్ఎస్. 39మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో సంఖ్యాపరంగానూ బాగానే ఉంది.
అటువంటి బీఆర్ఎస్‌పై కన్నేశాయి జాతీయ పార్టీలు. టార్గెట్ బీఆర్ఎస్‌గా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు పెడుతూ.. చైర్మన్ సీట్లను సొంతం చేసుకుంటోంది అధికార కాంగ్రెస్. కిందిస్థాయి నేతల నుంచి జెడ్పీఛైర్మన్లు, నియోజకవర్గాల్లో ప్రభావం చూపే నాయకులకు వల వేస్తూ.. పార్టీలో చేర్చుకుంటోంది. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇస్తామంటూ.. రెండు పార్టీల నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ తమను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, వాళ్లు గడ్డపారతో పొడిస్తే, తాము సూదితో అయినా పొడవకూడదా అంటూ జగ్గారెడ్డి గాంధీభవన్ సాక్షిగా చెప్పారు. బీఆర్‌ఎస్ చేసిన అలవాటే తాము కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్‌లోకి త్వరలో 20మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని.. కేసీఆర్ పక్కన ఉన్నా కూడా ఆ 20మందిని ఆపలేరని చెప్పారు జగ్గారెడ్డి. తాజాగా బీజేపీ నుంచి కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. తమతో 8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు టచ్‌లో ఉన్నారన్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్‌లో కీలక నేత అయిన హరీష్‌రావు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామన్నారు సంజయ్. హరీష్‌పై అన్ని పార్టీలు సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నాయని చిట్‌చాట్‌లో వెల్లడించారు బండి.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని పార్టీ అధినేత.. కేసీఆర్ అందరికీ భరోసా ఇస్తున్నారు. తుంటి ఆపరేషన్‌తో కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కేసీఆర్.. ఇటీవల ఛలో నల్లగొండ సభతో వీ ఆర్ ఫైటర్స్.. నాట్ సరెండర్స్ అనే సంకేతాలు కూడా ఇచ్చారు. సభ సక్సెస్ కావడం.. డైలమాలో ఉన్న లీడర్స్‌కు కొత్త ఊపునిచ్చిందని పార్టీలో ఇన్నర్ టాక్ నడుస్తోంది. అధికారం పోయినా.. ప్రజలు మనకే సపోర్ట్‌గా ఉన్నారని.. సభ తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని కాంగ్రెస్, బీజేపీ ధీమాగా చెప్తుంటే.. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి లేదని అంతే ధీమాగా ఉన్నారు గులాబీ బాస్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..