కొత్త పార్టీపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత! ఎన్నో ఆవేదనలు భరించలేక..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తాను కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కొత్త పార్టీ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం తప్ప మరేదీ తనకు అంగీకారం లేదని, పార్టీని కాపాడుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు వ్యతిరేకిస్తూ, కేసీఆర్ కుటుంబం కంటే ప్రజలంటేనే ఎక్కువ అభిమానం ఉందని తెలిపారు.

కొత్త పార్టీపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత! ఎన్నో ఆవేదనలు భరించలేక..
Mlc Kavitha

Updated on: May 30, 2025 | 8:00 PM

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె మరోసారి మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. తాను కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలన్నారు. మీడియాతో మరోసారి చిట్‌చాట్‌ నిర్వహించిన కవిత తనకంటూ ప్రత్యేకంగా జెండా, అజెండా లేదని స్పష్టం చేశారు. పార్టీని కాపాడుకోవడమే తన అజెండా అని అన్నారు. కేసీఆర్‌ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనన్నారు. పెద్దాయనను ఎవరేమన్నా ఊరుకోనని, ఎన్నో ఆవేదనలు భరించలేక, పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశానట్టు చెప్పారు.

భాగ్య రెడ్డి వర్మ, పీవీ నరసింహరావు వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో చేశామని.. అప్పట్లో తెలంగాణ బొగ్గు గని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారని చెప్పారు. యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించామని.. కేసీఆర్ దయవల్లనే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కిందని తెలిపారు కవిత.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు నోటీస్ ఇస్తే బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకునేవేనని స్పష్టం చేశారు. బీజేపీ వైపు బీఆర్‌ఎస్‌ చూడొద్దన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని చెప్పారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలిపేస్తామని తాను జైల్లో ఉన్నప్పుడే చెప్పారని, అయితే విలీనాన్ని తాను ఒప్పుకోనని అప్పుడే చెప్పానన్నారు. కేసీఆర్‌కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ అని చెప్పారు. లెటర్ రాయడంలో తన తప్పేం లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి