KA Paul: గద్దర్‌ను హత్య చేశారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజా నౌక గద్దర్‌ది ముమ్మాటికి హత్య చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. దీన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. గద్దర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గద్దర్‌పై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైరయ్యారు.
కిలారి ఆనంద్ పాల్.. షార్ట్‌గా కే ఏ పాల్. ఈ పేరు చెపితే తెలియని వారుండరు అనేంతలా పాతుకుపోయిన వ్యక్తి. నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్స్‌తో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ అగ్ర నేతలను కూడా తనదైన స్టైల్ లో ఏకి పారేయడం.. తన మీద తానే సెటర్లు వేసుకోవడం ఆయన ప్రత్యేకత. మొన్నటికి మొన్న తనను కొందరు చంపాలని చూస్తున్నారని.. తాను చనిపోతే స్వర్గానికి పోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా నిర్మల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈసారి డోసు పెంచి అంతకు మించిన కామెంట్సే చేశారు. తెలంగాణ ప్రజానౌక గద్దర్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గద్దర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని.. గద్దర్ మరణం పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. గద్దర్ హత్యకు గురైనట్లు నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేఏ పాల్.. ప్రత్యేక నిర్మల్ జిల్లా ఏర్పాటు అయినా కనీసం మండల స్థాయి అభివృద్ధి కూడా జరగలేదని ఎద్దేవా చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను ప్రజలేవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. రెండు ప్రభుత్వాల హాయాంలో సర్పంచ్లు అప్పుల పాలయ్యారని.. గ్రామాలు బాగు పడాలన్నా.. సర్పంచ్ లకు పునర్ వైభవం రావాలన్నా.. పాలన్న రావాలి…. పాలన మారాలి అని పిలుపునిచ్చారు. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నానని.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ నుంచి సర్పంచులను గెలిపిస్తే.. ఆయా గ్రామాలలో వంద రోజుల్లోనే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులందరికి ఉద్యోగం కల్పించి చూపిస్తామని.. రైతులను రాజులను చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదే ఫ్లోలో మా పార్టీలో చేరిన ప్రజా నౌక గద్దర్ ను కొందరు హత్య చేశారని.. గద్దర్ మరణం పై సిబిఐ విచారణ జరపాలని వ్యాఖ్యలు చేశాడు.
పద్మ అవార్డుల ప్రకటనతో తెలంగాణ ప్రజా గొంతుక గద్దర్ ప్రస్తావన తెరపైకి రావడంతో దీనిపై కేఏ పాల్ స్పందించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గద్దర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. బండి సంజయ్ అంటున్నట్టుగా గద్దర్ మావోయిస్ట్ మాత్రమే కాదని.. ప్రజల కోసం పోరాడిన మానవతమూర్తని కొనియాడారు. టెర్రరిస్టులకు పద్మ అవార్డులు ఇస్తున్న బీజేపీ.. మానవతావాది, తెలంగాణ ప్రజా గొంతుకను గౌరవించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.తెలంగాణ యుద్దనౌక ప్రజా గొంతు క గద్దర్ ను పద్మ అవార్డులతో గౌరవించకుండా అవమానించారని మండిపడ్డారు.ప్రజాశాంతి పార్టీలో చేరినందుకే గద్దర్ కు పద్మశ్రీ అవార్డు దక్కలేదన్నారు.
నిజానికి కేఏ పాల్ ఎంత పెద్ద సంచలన వ్యాఖ్యలు చేసినా లైట్ తీస్కో బ్రదర్ అన్నట్టుగానే చూస్తారు కొందరు జనం. ఇంకొందరు మాత్రం అరే భలే చెప్పాడే కేఏ పాల్ అంటారు. మరీ గద్దర్ మరణంపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై జనం ఎలా పట్టించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే..