ఒకరిది ఉద్యోగాల కోసం పోరాటం.. మరొకరిది పట్టు కోసం పాకులాట.. ఎవరి పట్టులో వారే.. తగ్గేదే లే అంటున్నారు. తెలంగాణ సర్కారు అల్టిమేటం ఇచ్చినా కార్యదర్శులు వెనక్కి తగ్గలేదు. 11వ రోజు కూడా జీపీఎస్ సిబ్బంది ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసినా సమ్మెలోనే ఉన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఇచ్చిన వార్నింగ్‌ను సైతం పక్కన బెట్టారు సిబ్బంది. తుమ్మితే ఊడిపోయే కొలువులు మాకొద్దు… మీరే ఉంచుకోండి అంటూ ప్రభుత్వానికే సవాల్ చేశారు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు. తెలంగాణా సర్కార్‌తో అమీతుమీ అంటున్నారు. 9 వేల మంది జేపీఎస్‌లు సమ్మె సైరన్ మోగించి 11 రోజుకు చేరింది. తమ ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వెయిట్ అండ్ సీ అంటోంది. మంత్రి ఎర్రబెల్లి ఒకటికి రెండుసార్లు.. చర్చలు జరిపినా ఫలితం లేదు. అందుకే చివరి అస్త్రంగా.. మంగళవారం వరకు డ్యూటీలో చేరాలంటూ అల్టిమేటం ఇచ్చింది. ఐనా సిబ్బంది వెనక్కు తగ్గకుండా తమ ఆందోళనను కొసాగిస్తున్నారు.
జిల్లాల వారీగా ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. కరీంనగర్‌లో జీపీఎస్ సిబ్బందికి బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల డిమాండ్ చేశారు. టీజేఎస్ నేత కోదండరామ్ సైతం సిబ్బంది దీక్షలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.
పోరాటాన్ని ఎంత వరకైనా తీసుకెళ్తామంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోరారు.. సిరిసిల్ల జిల్లాలో కార్యదర్శులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. కలెక్టర్ చౌరస్తాలో ధర్నా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా జేపీఎస్, ఓపీఎస్ కార్యదర్శల నిరసనలు కొనసాగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..