Hyderabad City : నగరంలో దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు దూరిపోయి అందినకాడికి కొల్లగొడుతున్నారు. తాజాగా సిటీలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ యువకుడు 8 తులాల బంగారం, 36 తులాల వెండి ఆభరణాలను అపహరించుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని కూన మహాలక్ష్మి నగర్‌లో నంద ప్రహ్లాద్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. అయితే, గత నెల 30వ తేదీన ప్రహ్లాద్ కుటుంబంతో కలిసి కరీంనగర్‌కు వెళ్లాడు. తిరిగి 1వ తేదీన ఇంటికి వచ్చారు. రావడం రావడంతోనే వారికి షాకింగ్ దృష్యం కనిపించింది. ఇంట్లో ఉన్న రెండు బీరువాల డోర్లు తెరిచి ఉండటం గమనించి షాక్‌కు గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రూ. 4.5 లక్షల విలువ గల ఎనిమిది తులాల బంగారం, 36 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీకి గురైన ఇంటికి వచ్చి.. పరిసరాలను పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. చోరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా ఈ కేసును చేధించారు. నిందితుడు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే యువకుడు అరుణ్‌గా గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 8 తులాల బంగారం, 36 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని బాధిత కుటుంబానికి అప్పగించారు పోలీసులు.
Also read:
Nokia G20: భారత్ మార్కెట్లోకి నోకియా బడ్జెట్ ఫోన్ విడుదల..అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే..?