Weather News: ఓ వైపు విపరీతమైన ఎండ, తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదిలాఉంటే.. హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. అక్కడక్కడ చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కురిసింది. అంతేకాకుండా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో ఎండల నుంచి కొంచెం ఉపశమనం కలిగించినట్లయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..