
హైదరాబాద్, జూన్ 23: సోమవారం అర్ధరాత్రి నగరంలో వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో రుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కుండపోత వాన పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, మియాపూర్‌లో దాదాపు 2 గంటల పాటు వాన దంచికొట్టింది. 5 గంటలకు వాన కాస్త తగ్గుముఖం పట్టినా.. తెల్లవారే వరకు ఆగకుండా కురుస్తూనే ఉంది. మరోవైపు శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్, సరూర్ నగర్, చంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూర్, చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్ ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ సంభవించే అవకాశం ఉందని అన్నారు. ఉరుములు, మెరుపులతో తుఫాను విరుచుకుపడు అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లోకి హఠాత్తుగా వరద నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
తెలంగాణలో నేటి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని అన్నారు. ఇక ఈ రోజు రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
క్లౌడ్‌బరస్ట్ అనేది చాలా చిన్న ప్రాంతంలో చాలా తక్కువ సమయంలో అత్యంత భారీ వర్షపాతం కురవడం. దీనివల్ల హఠాత్తుగా వరదలు రావచ్చు. కాలువలు, వాగులు పొంగిపొర్లవచ్చు. రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలగవచ్చు.