Weather Report: ఎండల వేళ చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. దీంతో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఇప్పటికే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షసూచనతో చల్లని కబురు అందింది.

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఏప్రిల్ 7,8,9వ తేదీల్లో వర్షసూచన జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
ఉపరితల ద్రోణి ప్రభావం
ఇక రాయలసీమ, తెలంగాణపై ఒక ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ఇక మూడ్రోజుల పాటు చిరు జల్లులు పడతాయని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరుగుతాయని హెచ్చరించింది. ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది.
ఏపీకి వర్షసూచన
ఏపీలో ఉత్తరాంధ్ర, విశాఖపట్నంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా జల్లులు పడతాయి. ఇక సోమవారం ఏలూరు జిల్లాల్లో వానలు పడ్డాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి హోర్డింగులు కూడా ఊడి పడ్డాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీలోని పలు ప్రాంతాలకు వాతావరణశాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న మార్కాపురంలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా.. నలుగురు గాయాలపాలయ్యారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని, పొలాల్లో ఉండటం ప్రమాదకరమని తెలిపింది. ఇక పిడుగులు పడే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచించింది. అటు ఆస్ట్రేలియా సమీపంలో మైలా, వలను తుఫాన్లు ఏర్పడగా.. వీటి ప్రభావంతో ఆసియా ప్రాంతంపై ఉండే అవకాశముంది. దీని వల్ల దక్షిణ భారతదేశంలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. అటు పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగనుంది.
