Ibomma Ravi: ‘పోటీలేని వ్యాపారమని పైరసీని ఎంచుకున్నా..’ ఐబొమ్మ రవి ఎపిసోడ్‌లో పూటకో నాటకం

తెలుగు సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన పైరసీ వీరుడు ఐబొమ్మ రవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఇటీవల ఇతడిని అరెస్ట్ చేసిన పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్‌ పోలీసుల కస్టడీకి అప్పగించారు. 12 రోజులపాటు అతడిని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణలో రవి పలు ఆసక్తికర విషయాలను..

Ibomma Ravi: పోటీలేని వ్యాపారమని పైరసీని ఎంచుకున్నా.. ఐబొమ్మ రవి ఎపిసోడ్‌లో పూటకో నాటకం
Ibomma Ravi Investigation

Updated on: Dec 20, 2025 | 10:12 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20: తెలుగు సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన పైరసీ వీరుడు ఐబొమ్మ రవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఇటీవల ఇతడిని అరెస్ట్ చేసిన పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్‌ పోలీసుల కస్టడీకి అప్పగించారు. 12 రోజులపాటు అతడిని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణలో రవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇప్పటికే ప్రసాద్‌, ప్రహ్లాద్‌ అనే మరో ఇద్దరిని రంగంలోకి దింపిన రవి.. వీరిని తన చిన్ననాటి స్నేహితులుగా పోలీసులకు వివరించాడు. ఇందులో ప్రసాద్‌ పదో తరగతి వరకు స్నేహితుడని చెప్పాడు. అయితే ప్రహ్లాద్‌ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

తాను కేవలం సినిమా వెబ్‌పోర్టల్స్‌కు సేవలు మాత్రమే అందించానని, అన్ని ఉద్యోగాల మాదిరిగానే దీన్ని ఎంపిక చేసుకున్నా అంటూ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి పోలీసు కస్టడీలో వెల్లడించినట్టు తెలుస్తుంది. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వ్యాపారం చేయాలని భావించానని, పైరసీని పోటీలేని వ్యాపారం భావించి.. దానిని ఎంచుకున్నట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రెండోరోజు (శుక్రవారం) కస్టడీలో వెల్లడించాడు. ఇక పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, పూటకో కొత్త విషయం చెబుతూ తాను అమాయకుడినంటూ పోలీసులకు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడంటూ అధికారులు చెబుతున్నారు.

నిందితుడు రవి గత ఆరేళ్లుగా సుమారు 21 వేల సినిమాలను పైరసీ చేసి.. వాటిని ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌పోర్టల్స్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే పైరసీ చట్టరీత్యా నేరమని తెలిసినా పట్టుబడకుండా ఉండేందుకు గట్టి పథకమే వేశాడు. ఎక్కడా తన ఆనవాళ్లు కనిపించకుండా ప్రహ్లాద్‌కుమార్‌ అనే వ్యక్తిని సృష్టించాడు. ప్రహ్లాద్‌ పేరుతోనే పాన్‌కార్డు, ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, వెబ్‌పోర్టల్స్‌ కొనుగోలు చేసి గుట్టుగా నడిపాడు. కరీబియన్‌ దీవుల్లోని సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్‌ పేరుతోనే ఉంది. ఇక మిత్రుడు ప్రసాద్‌ డిజిటల్‌ సంతకంతో ఆర్థిక లావాదేవీలు నడిపాడు. ఈ మొత్తం వ్యవహారంలో తాను కేవలం నామమాత్రమేనని నిరూపించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐబొమ్మ కేసులో గట్టిగా వినిపిస్తున్న ప్రహ్లాద్‌ అనే వ్యక్తి ఎవరనేది చెప్పకుండా రవి మౌనందాల్చుతున్నాడు. అధికారుల ప్రశ్నలకు గుర్తులేదు.. ఇప్పుడు చెప్పలేను.. అంటూ దాటవేయడం గమనార్హం. గతంలో కస్టడీకి తీసుకున్న సమయంలోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌పోర్టల్స్‌కు తానొక్కడే పైరసీ నడిపినట్లు అంగీకరించాడు. కానీ పట్టుబడి జైలుకెళ్తే బయటకు వచ్చే అవకాశం ఉండదనే భయంతో తరచూ మాట మారుస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.