ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మొరపెట్టుకుంది. 20రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఒప్పుకొని సంవత్సరం గడుస్తున్నా పెళ్లి ఊసే ఎత్తడం లేదని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ భవన్ వద్ద భోరున విలపించింది.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన ఓ యువతి.. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ అశోక్ మాటిచ్చాడు. ఆ తరువాత పెళ్లికి నిరాకరించడంతో.. కుషాయిగూడ పోలీస్‌లకు మొరపెట్టుకుంది. ఆ తరువాత 20రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని అతడు పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా పెళ్లి చేసుకోవడం లేదని.. న్యాయం చేయాలని బోరున విలపించింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. సమస్య పరిష్కారానికి సహకరించాలని టీఆర్ఎస్ మహిళా విభాగానికి సూచించారు.