
పాపం.. అతడి అసలు రూపం తెలియక గాఢంగా ప్రేమించింది.. అతనే సర్వస్వమని నమ్మింది.. ఇంట్లో వారిని సైతం వదిలిపెట్టి.. అతనితో సహాజీవనానికి ఒప్పుకుంది. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి.. చివరకు ఆ దుర్మార్గుడు మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది.. ప్రియుడి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం2లోని ఇందిరానగర్ వాసి ఆర్. సదానంద్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసించే రెడపాక పల్లవి (27) తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కూడా ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
అయితే, ఆమెతో సహజీవనం కొనసాగిస్తూనే అతను మరో యువతిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. అయినప్పటికీ.. పల్లవితో సహజీవనం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సదానంద్ కొద్దిరోజులుగా ఆమెపై దాడికి పాల్పడడంతోపాటు తీవ్రంగా వేధిస్తున్నాడు. దీంతో పల్లవి ఈనెల 22న బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తిలో నివసించే తన తల్లికి ఫోన్ చేసి సదానంద్ తనను తీవ్రంగా కొడుతున్నాడని వాపోయింది. చనిపోవాలని అంటున్నాడని.. లేదంటే పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆమెతో గోడువెళ్లబోసుకుంది.
దీంతో పల్లవి తల్లి 23న ఉదయాన్ని హైదరాబాద్ బయలుదేరింది. ఆమె మార్గమధ్యలో ఉండగానే సదానంద్ ఫోన్ చేసి, రాత్రి పల్లవి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమెతో చెప్పాడు. అనంతరం హైదరాబాద్ నగరానికి చేరుకున్న పల్లవి తల్లి లక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సదానంద్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..