AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: నిప్పుల కుంపటిలా మారిన ఏపీ, తెలంగాణ.. పిట్టల్లా రాలుతున్న జనం.. మరో 5 రోజులు రెడ్ అలర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 40 మంది వడదెబ్బతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరో ఐదు రోజుల పాటు హీట్ వేవ్ కొనసాగుతుందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఎక్కువగా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Weather Alert: నిప్పుల కుంపటిలా మారిన ఏపీ, తెలంగాణ.. పిట్టల్లా రాలుతున్న జనం.. మరో 5 రోజులు రెడ్ అలర్ట్..
Heatwave
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2026 | 6:25 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ప్రచండ రూపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతతో వడగాలులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ వడదెబ్బ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తుంటే… రాబోయే రోజుల్లో ఈ సెగలు మరింత తీవ్రం కానున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోవడంతో వడదెబ్బ రూపంలో మృత్యువు ముంచుకొస్తోంది. గడిచిన రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తెలంగాణలోనే 30 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రతకు రెండు రోజుల వ్యవధిలోనే 16 మంది వడదెబ్బతో బలి అయ్యారు. గురువారం తొమ్మిది మంది మృతి చెందగా, శుక్రవారం మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఇప్పల్ బోరు సమీపంలో వడదెబ్బతో మృతి చెందాడు. అలాగే కాటారం మండలం రేగులగూడెంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భూయాన్ వినోద్ కూడా వడదెబ్బ తాకిడికి ప్రాణాలు కోల్పోయాడు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కుంపటిలా మారడంతో వడదెబ్బ తగిలి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ తీవ్రమైన వేడిగాలుల కారణంగా జిల్లా వ్యాప్తంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటగా, ఖమ్మం రూరల్ మండలం పల్లీగూడెంలో అత్యధికంగా 46.3 డిగ్రీలు నమోదైంది. పశువులు కూడా ఎండ వేడికి తాళలేక మృత్యువాత పడుతున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఎండల తీవ్రతకు ఒక ఎద్దు వడదెబ్బ తగిలి మృతి చెందింది.

ఇటు ఏపీలోనూ వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విజయవాడ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వడదెబ్బ కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వారిలో ఐదుగురు రోజువారీ కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు కాగా, మిగిలిన వారిని యాచకులుగా గుర్తించారు. వన్ టౌన్ పరిధిలో ముగ్గురు, గవర్నర్ పేటలో ముగ్గురు, మాచవరం పరిధిలో ఇద్దరు, న్యూ రాజేశ్వరీ పేటలో ఒకరు, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. కూడళ్లలో ఉపశమన చర్యలు చేపట్టినా మరణాలు సంభవించడంతో అన్ని పోలీస్ స్టేషన్లను అధికారులు అప్రమత్తం చేశారు.

మరో ఐదు రోజులు రెడ్ అలర్ట్..

ఈ హీట్‌ వేవ్‌ తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కంటిన్యూ అవుతోందని అధికారులు హెచ్చరించారు. దీంతో పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు ఇంచార్జి జిల్లా కలెక్టర్ సంజనా సింహ. వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రాబోయే మరో ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని… కూలీలు, నిర్మాణ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు తెలంగాణలోనూ వాతావరణ శాఖ రాబోయే నాలుగు రోజుల పాటు వివిధ జిల్లాలకు ‘హీట్ వేవ్’, ‘రెడ్ అలర్ట్’ హెచ్చరికలను జారీ చేసింది. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఈ వడగాల్పులు ఇలాగే కొనసాగుతాయని వెల్లడించింది. హైదరాబాద్ సైతం ఈ సెగలకు మినహాయింపు ఏమీ కాదని స్పష్టం చేసింది.

Follow Us