AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్థరాత్రి 12వ అంతస్తు బాల్కనీ నుంచి అరుపులు.. ఏంటని వెళ్లి చూడగా..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకోనియా అపార్ట్‌మెంట్‌లో 12వ అంతస్తు నుంచి కిందపడడంతో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: అర్థరాత్రి 12వ అంతస్తు బాల్కనీ నుంచి అరుపులు.. ఏంటని వెళ్లి చూడగా..
Gachibowli Woman Dead
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 8:52 PM

Share

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది.12వ అంతస్తు నుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకోనియా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అపర్ణ అన్మోల్ అరుణ్ (36) జూలై 3వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో 12వ అంతస్తు నుంచి కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

మృతురాలు తన భర్త అన్మోల్ కుమార్, ఆటిజంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే కుమారుడిని చూసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. ఇక మృతురాలి సోదరుడు అవినాష్ అరుణ్ ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తన సోదరి మృతిపై తన బావ అన్మోల్ కుమార్‌పై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పొరుగువారి ద్వారా ఘటన విషయం తెలిసి హైదరాబాద్‌కు చేరుకునేలోపే సోదరి మృతి చెందినట్లు సమాచారం అందిందని పోలీసులకు తెలిపారు.

ఘటన ఫ్లాట్ బాల్కనీలోని షూ ర్యాక్ సమీపంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు కిందపడిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ఇన్‌క్వెస్ట్, పోస్టుమార్టం తదితర చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు. ఘటనకు గల పూర్తి కారణాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us