ప్రపంచం ఎంత పరుగులు పెడుతున్నా.. టెక్నాలజీలో ఎంత మార్పులు వచ్చినా.. మూఢ నమ్మకాల విషయాలను మాత్రం వీడటం లేదు.. మూఢ నమ్మకాలపై అవగాహనలు కల్పించినప్పటికీ.. కొందరు.. ఆ జాఢ్యం నుంచి బయటపడటం లేదు.. అలాంటిదే చేతబడి కూడా. మా మీద ఎవరో చేతబడి చేశారు.. అందుకే ఇలా జరిగింది.. ఇదంతా చేతబడి కారణమే అని నిత్యం మనం ఎక్కడో అక్కడ వింటూనే ఉంటున్నాం. ఎవరికైనా గిట్టనివాళ్లు మంత్రతంత్రాలతో చేతబడి చేసి వారిని ఆర్థికంగా, మానసికంగా దెబ్బ తీయడానికి ఇలాంటివి చేస్తుంటారు అని చెప్తారు. నిజంగా చేతబడి అనేది ఉందా లేదా అనే విషయం తెలియదు కానీ, దానిని భూతంగా చూపే సంఘటనలు మాత్రం మన చుట్టూ చాలానే జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలో తాజాగా చేతబడి ఆనవాళ్లు కనిపించాయి. నడిరోడ్డుపై తల లేని దూడ మొండెం ప్రత్యక్షమైంది. అదే ప్రాంతంలో పసుపు, కుంకుమతో పాటు కొబ్బరికాయతో పూజలు చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి.
ఇది గమనించిన స్థానికులు ఖచ్చితంగా ఇది ఎవరో చేతబడి చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు అది ఎవరు చేశారో ఏంటనేది తెలియకుండా బిక్కుబిక్కుమంటూ ఏదైనా జరగరానిది జరుగుతుందేమోనని భయపడుతున్నారు. ఒకవేళ చనిపోయిన దూడని వీధుల్లో సంచరించే కుక్కలు ఏమన్నా లాక్కొచ్చాయా అనుకుందాం.. అన్న అక్కడ కనిపిస్తున్న ఆనవాళ్లు అలా లేవు. కుక్కలు లాక్కొస్తే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ లాంటివి మరి ఎక్కడి నుంచి వచ్చినట్టు అని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా నడిరోడ్డుపైనే ఉన్నపళంగా ఇలాంటిది కనిపించడం బట్టి చూస్తే నిజంగానే రాత్రికి రాత్రే ఎవరైనా చేతబడి చేసి వెళ్లారా అనే అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు.
జనావాసాల మధ్యలో ఇలాంటి చేతబడి ఆనవాళ్లు కనిపించడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అప్పటి నుంచి అందరిలో ఒకటే ఆందోళన. ఎప్పుడు ఏ ఘోరం చూడాల్సి వస్తుందోనని భయపడిపోతున్నారు. ఇది కాస్త స్థానిక ఎమ్మెల్యే దృష్టి వరకూ వెళ్లింది. ప్రజల సమస్యను విన్న ఎమ్మెల్యే స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..