Agnipath Scheme Protest: అగ్నిపథ్(Agnipath) పథకంపై తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు నెలకొన్నవేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావనను పెంచాలనే లక్ష్యంతో సుదీర్ఘ ఆలోచనలు, చర్చలు జరిగిన తర్వాతే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం సరికాదని హితవు పలికారు. పథకం ప్రకారమే సికింద్రాబాద్(Secunderabad) లో విధ్వంసం సృష్టించారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘అగ్నిపథ్’ వంటి పథకాలు ఏళ్లుగా అమల్లో ఉన్నాయన్న కేంద్ర మంత్రి దేశ సేవ చేయాలన్న తపన ఉన్నవాళ్లే అగ్నిపథ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. భారత్‌లో ఈ పథకాన్ని తప్పనిసరి చేయట్లేదని చెప్పారు. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరతారని, బలవంతమేమీ లేదని వివరించారు.‘అగ్నిపథ్’ వీరుడు బయటకు వచ్చాక ఉపాధి కల్పించేలా తయారవుతారన్న కిషన్ రెడ్డి.. మోదీ ప్రధాని కాకముందు నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ ఘటనలో రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉండిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, ప్రయాణికుల బైక్‌లు తగలబెట్టినా స్పందించలేదని అన్నారు. రైల్వే కోచ్‌లకు నిప్పు పెట్టారు. బోగీలన్నీ ధ్వంసమయ్యాయి. ఇన్ని జరుగుతున్నా పోలీసులు సకాలంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. అగ్నిపథ్‌పై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులతోనూ చర్చలకు సిద్ధమేనని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో అగ్నిపథ్ వంటి పథకాలు ఏళ్లుగా అమలవుతున్నాయి. ఇజ్రాయిల్‌లో 12 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది. ఇరాన్‌లో 20 నెలల పాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారు. భారత్‌లో తప్పనిసరి చేయట్లేదు. ఇష్టం ఉన్నవాళ్లే చేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వాలంటరీ పథకం తీసుకొస్తే దాడులు జరగడం దురదృష్టకరం.
– కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి