Kishan Reddy: పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేసేది కేసీఆరే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు..

మునుగోడు ఉప ఎన్నిక నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ ఈ కుట్రకు తెర లేపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారం పోతుందనే భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు..

Kishan Reddy: పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేసేది కేసీఆరే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు..
Kishan Reddy

Updated on: Oct 27, 2022 | 1:53 PM

మునుగోడు ఉప ఎన్నిక నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ ఈ కుట్రకు తెర లేపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారం పోతుందనే భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపే స్కెచ్ వేశారని ఆరోపించారు. సీఎం అయిపోతానని కేటీఆర్ ఫిక్స్ అయిపోయారన్న కేంద్ర మంత్రి.. అధికారం పోయాక దర్యాప్తు జరుపుతామన్న భయం వారిలో ఉందని చెప్పారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే ఈ డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఫామ్ హౌస్ కు వారిని ఎవరు పంపించారన్న కిషన్ రెడ్డి.. వారిలో బీజేపీ నేతలు ఉన్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి బీజేపీ కుట్ర చేసిందంటూ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. డబ్బు, పదవులు, కాంట్రాక్టుల ఆశచూపించి, డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా విజయం మాత్రం బీజేపీదేనని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని స్పష్టం చేశారు. దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత? ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకున్నది తెరాస కాదా. వారితో రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా?. పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేసేది కేసీఆరే. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది. సీఎం పదవి ఊడుతుందని కేసీఆర్‌కు భయం పట్టుకుంది. మంత్రి హత్యాయత్నం వ్యవహారంలో కూడా బీజేపీపై ఆరోపణలు చేశారు. దుబ్బాకలో కూడా ఇలాంటి నాటకాలే ఆడారు. పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల ప్రకారం కేసులు పెట్టాలంటే ముందుగా కేసీఆర్‌పైనే పెట్టాలి. నలుగురు ఎమ్మెల్యేలు రావడం వల్ల మాకు ఒరిగేదేమీ ఉండదు. ఫాంహౌస్‌లో పట్టుబడ్డవారు మా పార్టీ వాళ్లు అని ముద్ర వేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి.

– కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి

సానుభూతి పొందేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీ మారాలనుకోవడం పెద్ద నేరమేమీ కాదన్న ఆయన.. ముఖ్యమంత్రిలా తమకు ఫాంహౌస్‌లు లేవని ఎద్దేవా చేశారు. ఉపఎన్నిక కోసం ఇంత చిల్లర రాజకీయం అవసరమా అని మండిపడ్డారు. సీఎం పదవి హుందాతనాన్ని కేసీఆర్‌ దిగజారుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పనైపోయిందనే ఇప్పుడిలా కొత్త నాటకాలకు తెర లేపారని, మధ్యవర్తుల అవసరం లేకుండానే మా పార్టీలోకి రావొచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..