Kishan Reddy: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..

రాష్ట్రంలోని పేద విద్యార్ధులకు లబ్దిని చేకూర్చే పోస్ట్ మెట్రిక్ ఎస్సీ/ఎస్టీ స్కాలర్‌షిప్‌ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు..

Kishan Reddy: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..
Kishan Reddy
Follow us

|

Updated on: Mar 01, 2022 | 8:00 PM

రాష్ట్రంలోని పేద విద్యార్ధులకు లబ్దిని చేకూర్చే పోస్ట్ మెట్రిక్ ఎస్సీ/ఎస్టీ స్కాలర్‌షిప్‌ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. గత విద్యా సంవత్సరం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కలిపి విడుదల చేయాల్సిన స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల వివరాలను తక్షణమే ధ్రువీకరించి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆయన లేఖలో కోరారు.

షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్ధులకు పెద్ద ఎత్తున పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను పునరుద్దరించేందుకు 2020 డిసెంబర్‌లో కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ స్కాలర్ షిప్‌లు మంజూరు అయ్యేలా, తగిన సమయంలో నగదు విద్యార్ధుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఈ స్కాలర్‌షిప్‌లలో కేంద్ర ప్రభుత్వం తమ వాటాను 12 శాతం నుంచి 60 శాతానికి పెంచిందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఆర్ధిక ఇబ్బందులతో విద్యార్ధులపై మానసిక ఒత్తిడి కలగకుండా పాఠ్య పుస్తకాల కొనుగోలు, వసతి గృహాల ఫీజులు, ఇతర ఖర్చులకయ్యే వ్యయాన్ని విద్యార్ధులకు అందించడమే ఈ స్కాలర్‌షిప్‌ల ప్రధాన లక్ష్యం.. గత విద్యా సంవత్సరం 2020-21లో స్కాలర్ షిప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం నిధులు తెలంగాణ ప్రభుత్వానికి అందాయి. ఆ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి అర్హులైన విద్యార్ధులకు అందాల్సిన స్కాలర్ షిప్‌లు ఇంకా మంజూరు కాలేదు. అలాగే ఈ విద్యాసంవత్సరం(2021-22)లో సుమారు 2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోగా.. దీనికి సంబంధించిన సమాచారం సంబంధిత పోర్టల్‌లో ఇంకా అప్‌లోడ్ కాలేదు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా ఈ స్కాలర్‌షిప్‌ల విషయంలో జాప్యం జరుగుతోంది. కనుక ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి.. స్కాలర్ షిప్ డబ్బులు నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోకి బదిలీ అయ్యేలా చూడాలని కోరుతున్నట్లుగా కిషన్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు.