
హైదరాబాద్, అక్టోబర్ 2: కాషాయ పార్టీ నాయకత్వానికి అసంతృప్తి నేతల తీరు అంతుచిక్కడం లేదట. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో స్వాగతం పలికేందుకు రమ్మని చెప్పినా.. రాలేదు ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు. ఇప్పుడు ఆ అసమ్మతి నేతల పరిస్థితి ఏంటో తెలియక బీజేపీ హైకమాండ్ సతమతమవుతుంటే.. వారు దారికి వస్తారో ? లేక దారి చూసుకుంటారో ? అనే టాక్ పార్టీలోని కొందరి నాయకుల్లో నడుస్తోంది. ఇంతకీ వారెవరు.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.!
ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనతో.. తెలంగాణ కాషాయ పార్టీలో కొత్త జోష్ వచ్చినా… కొంత మంది అసమ్మతి నేతలు దారికి రాకపోవడంతో.. వారి తీరు అంతుచిక్కకపోవడంతో.. పార్టీలో చర్చ విపరీతంగా సాగుతోంది. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ మోడ్‌లో ఉంటున్నారు. పార్టీ అసమ్మతి నేతల వరుస భేటీల్లో పాల్గొన్నారు. బీజేపీలో కొనసాగుతారా ? పార్టీ మారుతారా ? అన్న దానిపై రాజగోపాల్ రెడ్డి ఏ క్లారిటీ ఇవ్వడం లేదు. తన అనుచరుల వద్ద మరో వారం రోజుల తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెబుతున్నారు. పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికేందుకు రావాలని పార్టీ పెద్దలు చెప్పినా.. ఆయన మాత్రం వెళ్లలేదు. దీంతో పార్టీలో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి గురించే విస్తృత చర్చ కొనసాగుతోంది.
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కూడా ప్రధాని నరేంద్రమోదీ పాలమూరు పర్యటనకు దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆమె మోదీ పర్యటనలో పాల్గొనలేదని చెబుతున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో మాత్రం బీజేపీకి అనుకూలంగా ట్విట్స్ చేస్తున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయసుధను ప్రధాని మోదీని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రిసీవింగ్ చేసుకోవడానికి రావాలని చెప్పినా.. ఆమె కూడా డుమ్మా కొట్టారు. మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, సంజీవరావు, ఆకుల రాజేందర్ తదితరుల పేర్లను ప్రధాని రిసీవింగ్ జాబితాలో పెట్టినా ఎవ్వరూ రాలేదు.
ఇదిలా ఉండగా.. కమలం పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచేందుకు ఓ వైపు అగ్రనేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే.. మరోవైపు అసమ్మతి నేతల తీరు మాత్రం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ముందు అసమ్మతి నేతలను బీజేపీ హైకమాండ్ ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి మరి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..