‘వారికి రాష్ట్రాన్ని అప్పగిస్తే అమ్ముకుంటారు’.. విపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో ఎన్నికల వేళ నేతల మాటల తూటాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రజాక్షేత్రంలో నేరుగా యుద్ధం చేయలేని ప్రతిపక్షాలు శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, ఎత్తులు వేసినా.. బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. వందేళ్ల క్రితమే వారంటీ అయిపోయిన పార్టీ కాంగ్రెస్..
హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్రంలో ఎన్నికల వేళ నేతల మాటల తూటాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రజాక్షేత్రంలో నేరుగా యుద్ధం చేయలేని ప్రతిపక్షాలు శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, ఎత్తులు వేసినా.. బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. వందేళ్ల క్రితమే వారంటీ అయిపోయిన పార్టీ కాంగ్రెస్, మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. ఓటుకు నోటు కేసులో దొరికి.. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. సూర్యపేట, నల్లగొండ జిల్లాల్లో కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. సూర్యపేటలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరిపోయే దీపం కాంగ్రెస్.. దింపుడు గల్లం ఆశతో ఎదురుచూస్తోందని అన్నారు. ముసలి నక్క కాంగ్రెస్‌ను నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపలా పెట్టినట్లేనని విమర్శించారు.
మాది మహాత్మగాంధీ వారసత్వమైతే.. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వమని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వస్తున్నా.. రావట్లేదని ఆరోపణలు చేస్తున్న, అనుమానం ఉన్నవాళ్లు రాండి బస్సుల్లో తిప్పి చూపిస్తామని చెప్పారు. తీగలు పట్టుకోండి తెలుస్తుంది.. దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోద్దని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్‌ది వారసత్వ రాజకీయమేనని.. రాణి రుద్రమ వారసత్వం, అమరుల ఆశయ వారసత్వం మాది.. కొమరం భీమ్, బాగ్యారెడ్డి వారసత్వం మాది అన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో అద్భుతాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమేనని చెప్పారు. సూర్యపేటలో జగదీష్‌కి డిపాజిట్ రాదన్న కోమటిరెడ్డికి తేల్చుకుందాం రా అని మంత్రి సవాల్ విసిరారు. కలలో కూడా ఊహించని విధంగా సూర్యపేటను అభివృద్ధి చేసిన మంత్రి జగదీష్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్లతో గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..